ప్రజాశక్తి-కడప ప్రతినిధి/చాపాడు
విభజన చట్టంలోని హామీ అయిన కడప ఉక్కు పరిశ్రమ శిలాఫలకానికే పరిమితమైందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్ అన్నారు. జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లా నుంచి కడప జిల్లా మైదుకూరుకు మంగళవారం రాత్రికి చేరుకుంది. తొలుత సిపిఎం ప్రజా రక్షణభేరి బస్సు యాత్రకు పట్టణ శివారు నుంచి బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. యాత్ర బంద సభ్యులకు సిపిఎం నాయకులు ఘన స్వాగతం పలికారు. మూడు రోడ్ల కూడలి నుంచి బహిరంగ సభ జరిగే ప్రాంతం వరకు ర్యాలీ నిర్వహించారు. బద్వేలు రోడ్డులోని క్లాత్ మార్కెట్ వద్ద సభ నిర్వహించారు. బస్సు యాత్ర ఉత్సాహాన్ని నింపింది. నాయకుల ప్రసంగాలు రైతులు, ఉద్యోగ, కార్మిక వర్గాలను ఆలోచింపజేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నినాదాలు మారుమోగాయి. ప్రజా నాట్యమండలి కళాకారులు నృత్యాలు, పాటలు ప్రదర్శిం చారు. మైదుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో గఫూర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అసమర్థత వల్ల ఉపయోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై తమకు హక్కు లేదని కెసిఆర్‌కు అనుకూలంగా మాట్లాడటం తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసికి, తెలుగుగంగకు, గాలేరు-నగరికి నీరు ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. కాశినాయన మండల పరిధిలో వేల ఎకరాలు బడా నాయకుల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర సింహంగా చెప్పుకునే సిఎం ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్రం వద్ద గ్రామ సింహంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్టంలో జగన్మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు సిఎం సీటు కోసం కొట్లాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం లేదని రూ.పది వేలతో స్కీం వర్కర్లు ఎలా బతకగలరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రూ.పది వేలతో ఒక నెల బతకగలరా అని నిలదీశారు. ఇసుక, మద్యం అమ్మకల్లో వచ్చిన ఆదాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పోతుందని, వైసిపి ప్రభుత్వం బందిపోట్ల ముఠాగా తయారైందని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజల సమస్యలపై ఆలోచించడం లేదని రాష్ట్రంలో ప్రజలు పార్టీల వారీగా విడిపోయారని తెలుగుదేశం, వైసిపి వలన ప్రజలకు ఒరిగేది ఏం లేదన్నారు. టిడిపి బిజెపి ఉచ్చులో నుంచి బయటకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి
సిపిఎం రాష్ట్ర నాయకులు శివనాగరాణి
ప్రభుత్వం వ్యవ సాయ కూలీలను ఆదుకునే పరిస్థితి కనపడడం లేదని సిపిఎం రాష్ట్ర నాయకులు శివ నాగరాణి అన్నారు. దేశంలో కూలీలకు సమాన వేతనం అందడం లేదని కేరళలో రూ.350 ఉపాధి కూలీ అందుతుంటే మన రాష్ట్రంలో రూ.200 కూడా అందడం లేదన్నారు. జిల్లాలో వేల ఎకరాల అసైన్డ్ భూమి అందుబాటులో ఉందని పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రంలో పనులు లేవని దీనితో వలసలు పెరుగుతున్నాయన్నారు. చదువుకున్న వారికి ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వెళుతున్నారన్నారు.
అన్నివిధాల వెనుకబడిన మైదుకూరు
- సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
మైదుకూరు నియోరరజక వర్గం అన్ని విధాల వెనుకబడి ఉండిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ అన్నారు. ఈ ప్రాంతం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉందని రాజోలి ఆనకట్ట ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే కృషి చేయాలన్నారు. 50 వేల ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సూచించారు. కెసి కెనాల్ స్థిరీకరణకు గుండ్రేవుల రిజర్వాయర్ ఏర్పాటు చేయాలన్నారు. తెలుగుగంగ పిల్ల కాలువలను ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందివాలన్నారు. కెపి ఉల్లి రైతులను ఆదుకునేందుకు శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాణా కేంద్రాన్ని పునరుద్ధరించాలన్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి కనీస మౌలిక వసతులకు నోచుకోని పేదల కాలనీలు అభివృద్ధి పరచాలన్నారు. బస్సు యాత్ర రాత్రికి బద్వేలుకు చేరుకుంది. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వర రావు, భాస్కరయ్య, అనిల్ కుమార్, రమాదేవి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కె.సత్యనారాయణ, వి.అన్వేష్, కాశినాయన మండల కార్యదర్శి వై.పోలయ్య, బి.మఠం మండలం కార్యదర్శి గోవిందు, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు సునీల్, రాహుల్, జిల్లా మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజరు కుమార్, ఖాజీపేట సిపిఎం నాయకులు వెంకటసుబ్బయ్య, మైదుకూరు మండల నాయకులు షరీఫ్, భీముడు, గురువయ్య, సుధాకర్, గంగయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు అజరు, నాయకులు, ప్రజలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.