Dec 17,2022 21:47

బోసిపోయిన మహిళా ప్రాంగణం

మూడేళ్లుగా పైసా ఇస్తే ఒట్టు
బోసిపోయిన మహిళా ప్రాంగణం

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తిరుపతి మహిళా ప్రాంగణం అంటే దశాబ్దకాలం క్రితం వరకూ ఎంతో ప్రత్యేకత. బాధిత మహిళలకు అండగా ఉందన్న పేరుండేది. మద్య, నిరుపేద మహిళలు టైలరింగ్‌, జర్నలిజం, వ్యవసాయం తదితరాల్లో శిక్షణ ఇచ్చేది. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు సర్టిఫికేట్‌ పొంది చిన్న చిన్న పరిశ్రమలకు దరఖాస్తు చేసుకుని స్వయం శక్తితో ఎదిగేవారు. ఏడాదికి 500 మంది మహిళలు వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది బయటకు వెళ్లేవారు. అలాంటి మహిళా ప్రాంగణం నేడు బోసిపోయింది. మూడేళ్లుగా మహిళా సంక్షేమ శాఖ నుంచి పైసా కూడా కేటాయించకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఓ ప్రత్యేకాధికారి, ఇద్దరు అటెండర్లు, ఒక వాచ్‌మెన్‌, ఇద్దరు ఉద్యోగులు రోజువారి రిజిష్టర్‌లో సంతకాలు చేసి మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
మహిళలు ఫ్యాషన్‌ డిజైనింగ్‌కు తెచ్చిన కుట్టుమిషన్లు తుప్పుపట్టిపోయాయి. ప్రాంగణం మొత్తం పారిశుధ్యం క్షీణించింది. ఏ గది చూసినా బూజుపట్టి ఉంది. తాము ఏ పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నామని ఒకరిద్దరు సిబ్బంది వాపోవడం గమనార్హం. చాలా మంది మహిళలు తమకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్పించాలని, పాడి పరిశ్రమపై శిక్షణ ఇవ్వాలని, జర్నలిజంలో మెలకువలు నేర్పాలని వంటపై అవగాహన కల్పించాలని దరఖాస్తు చేసుకున్నా నిధుల లేమితో తాము ఏమీ చేయలేక దయనీయ స్థితిలో ఉన్నామని చెప్పి తిప్పి పంపించేస్తున్నారు. నిధులు వస్తే తప్ప ఏమీ చేయలేమని చెబుతుండటం గమనార్హం.
మూడేళ్లుగా పైసా రాలేదు : వాసంతి, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్‌
కరోనా ముందు 90 మంది మహిళలు ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఒక్కో బ్యాచ్‌లో 30 మంది చొప్పున శిక్షణ ఇస్తూ మూడు బ్యాచ్‌లకు 90 మందికి శిక్షణ ఇచ్చాం. 20 మంది మహిళలకు జర్న లిజంపై శిక్షణ ఇవ్వడంతో నవోదయం, వెలుగు పత్రికల్లో రాణిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లు సైతం తమ వద్ద శిక్షణ నేర్చుకుని ఓ మహిళ ఎస్వీబీసీ ఛానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తోంది. పాడి పరిశ్రమపై వెటర్నరీ యూనివర్సిటీలో శిక్షణ ఇప్పించేవాళ్లం. కరోనా పోయినా ప్రభుత్వం నుంచి 'పైసా' రాలేదు.