ప్రజాశక్తి - తాడికొండ : రోడ్డు ప్రమాదంలో ఆశా కార్యకర్త, ఆమె సోదరుడు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని లాం శివారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడికొండూరు మండలం డోకిపర్రుకు చెందిన నల్లగొర్ల గోపిచంద్ (20), తన పెద్దమ్మ కూమార్తె అయిన పెదకూరపాడు మండలం కంబంపాడుకు చెందిన మొక్కల గోవర్ధనీ (32) వద్దకు మంగళవారం వెళ్లాడు. గోవర్ధని ఆశ వర్కర్ నుండి ఎఎన్‌ఎంగా ప్రమోషన్ రావడంతో ట్రైనింగ్ నిమిత్తం కంబంపాడు నుండి గుంటూరు తన తమ్ముడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా త్రిబుల్ ఎక్స్ సబ్సుల కంపెనీకి చెందిన బస్సు ఢ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నుండి కింద పడిన గోవర్ధని అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన గోపీని అంబులెన్సలో ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)కు తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పరిహారం కోసం సిఐటియు ఆందోళన
ప్రజాశక్తి-గుంటూరు : 75 తాళ్లూరు పిహెచ్‌సిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ ఎం.గోవర్ధని ఆమె సోదరుడు గోపీచంద్ మృతి నేపథ్యంలో వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ జిజిహెచ్ మార్చురీ వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కార్యదర్శి వై.నేతాజీ, కార్యదర్శి లక్ష్మణరావు, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, ఆశా వర్కర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కార్యదర్శి డి.శివకుమారి మాట్లాడారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వారు చనిపోయారన్నారు. ఇద్దరికీ రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, త్రిబుల్ ఎక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే త్రిబుల్ ఎక్స్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.










