Aug 12,2023 17:24

సరైన వసతులు లేవని వాపోతున్న వైనం
రుచిపచిలేని భోజనం పెడుతున్నారని ఆవేదన
ప్రజాశక్తి - వీరవాసరం

             వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇటీవల కొత్తగా చేరిన ఆశావర్కర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. సరైన వసతులు లేని ప్రాంతాన్ని శిక్షణా కేంద్రంగా ఎంపిక చేయడం చేశారని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తడికలపూడి వద్ద నిర్వహించే ఈ శిక్షణా తరగతులు జిల్లాలు విడిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా వారికి వీరవాసరం పిహెచ్‌సి కేంద్రంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆశావర్కర్లు వాపోతున్నారు. శిక్షణ సమయంలో చేయాల్సిన ఏర్పాట్లకు ఆ శాఖలోని జిల్లాస్థాయిలో ఒక అధికారి కాంట్రాక్టు తీసుకున్నట్లు చెబుతున్నారు. వీరవాసరంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటే ప్రతి రోజు తణుకు నుంచి భోజనాలు వస్తున్నట్లు సమాచారం. అది కూడా రుచిపచిలేని భోజనం పెడుతున్నారని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శిక్షణా కేంద్రానికి ఉదయం తొమ్మిది గంటలకు చేరుకోవడానికి వ్యయప్రయాసాలకు లోనవుతున్నట్లు చెబుతున్నారు. సక్రమంగా లేని రోడ్లతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వీరవాసరానికి నేరుగా బస్సు సదుపాయం లేకపోవడంతో వారు పడుతున్న అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. అన్ని సదుపాయాలకు అనుకూలంగా ఉన్న జిల్లా కేంద్రం భీమవరంలో కాకుండా వీరవాసరంలో శిక్షణా తరగుతులు నిర్వహించడలో ఉన్న ఆంతర్యం ఏమిటన్నది జిల్లా అధికారులకే తెలియాలన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఆశావర్కర్లకు ఇంటి వద్ద చిన్న పిల్లలు ఉండడంతో ప్రతి రోజు ఇంటికి వెళ్లి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. శిక్షణా తరగతులకు వచ్చే వారికి రానుపోను ఛార్జీలు చెల్లిస్తారో లేదోనన్నది స్పష్టత లేదు. మొదటి రోజు, చివరి రోజుకు మాత్రమే ఛార్జీలు చెల్లిస్తారని ఆశావర్కర్లు చెబుతున్నారు. తినడానికి అనువుగా లేని ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ పట్ల కూడా ఆశలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రుచి లేని భోజనం వల్ల ఇంటి వద్ద నుంచే తెచ్చుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు ఆశలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న ఆశల ఇబ్బందులపై జిల్లా అధికారులు దృష్టిపెట్టి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.