ప్రజాశక్తి-చీరాల: జన విజ్ఞాన వేదిక విద్యార్థుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన, వినోద శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని రెడ్ క్రాస్ చైర్మన్, డాక్టర్ హైమా సుబ్బారావు అన్నారు. పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక చీరాల డివిజన్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి విజ్ఞాన శిక్షణ, వినోద కార్యక్రమాలను జెవివి నాయకులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా హైమా డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు హాజరై ప్రారంభించారు. విద్యార్థులందరూ శాస్త్రి ఆలోచనలతో చదువులు కొనసాగిస్తూ మూఢనమ్మకాలను పారద్రోలాలని అన్నారు. జేవివి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో బాపట్లకు చెందిన మెజీషియన్ నాగేశ్వరరావు పలు రకాల మ్యాజిక్ షోల ద్వారా మొదటి రోజు చిన్నారులను ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూఢనమ్మకాలను పారదోలి వాస్తవాలను జనం ముందు ఉంచడమే సైన్స్ ముఖ్య ఉద్దేశం అన్నారు. మనం ప్రతిరోజూ కళ్లతో చూస్తున్నా సంఘటనలు నిజం కాదని, అది నిజమా కాదా అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మన భావాలన్నీ సైన్స్‌తో ముడిపడి ఉంటాయన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రత్యేక వేసవిజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నరని ఈ శిబిరాలు ఈ నెల 17 వరకు కొనసాగుతాయి.
సైన్స్ పట్ల, విజ్ఞానం పట్ల ప్రజలు చిన్నారులను చైతన్యం పరచడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కుర్రా రామారావు, వీరాంజనేయులు, సుభాని, పిచ్చయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు.










