
ప్రజాశక్తి - ఆచంట
యువత శిక్షణ శిబిరాలను వినియోగించుకుని భవిష్యత్తుకు ఉజ్వల బాట వేసుకోవాలని ఎంఇఒ ఎ.ఉషారాణి, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ ఇందుకూరి వెంకట సత్యనారాయణరాజు అన్నారు. ప్రభుత్వ ఐటిఐలో 2021-2023 విద్యా సంవత్సరంలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 50 మంది విద్యార్థులకు గురువారం కన్వకేషన్ సర్టిఫికెట్లు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఇఒ ఉషారాణి పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు, ప్రతి ట్రేడ్‌లో ఫస్ట్ ర్యాంకు వచ్చిన ఎలక్ట్రీషియన్‌లో ఎం.సాయిలక్ష్మణ్ కుమార్, ఆర్‌అండ్ ఎసి మెకానిక్‌లో వి.సతీష్‌కుమార్, మోటార్ మెకానిక్‌లో కె.వంశీకృష్ణలకు మెమోంటోలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సూపరింటెండెంట్ జిఎల్‌ఎన్.రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.