- లోక్‌సభ పనితీరు, విశిష్టతను వివరించిన ఎంపీ
- 'ఢిల్లీ దర్శన్'కు జిల్లా యువతకు అరుదైన అవకాశం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : పలురంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు పార్లమెంట్‌ను మంగళవారం సందర్శించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆలోచనల మేరకు చట్టసభల్లో ప్రజాప్రతినిధుల పనితీరు, వాటి నిర్వహణ, ప్రత్యేకతలను భవిష్యత్ భారత నిర్మాతలైన యువతకు తెలియజేసేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అరుదైన అవకాశాన్ని జిల్లా యువతకు అందించేలా 'ఢిల్లీ దర్శన్'కు రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అందిన దరఖాస్తులను పరిశీలించి తుది దశలో విద్య, క్రీడలు, సామాజిక కార్యక్రమాల్లో రాణిస్తున్న జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులను ఎంపిక చేశారు. వీరంతా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంట్ కార్యకలాపాలను వీక్షించారు. సభలో సభ్యుల పనితీరును నిశితంగా తెలుసుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు వీరందరికీ పార్లమెంట్‌ను చూపించారు. పలు మంత్రిత్వశాఖలు, ప్రధాన గ్రంథాలయం, వాటి విశిష్టతను తెలియజేశారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో విద్యార్థినులంతా ఢిల్లీలో పలు ప్రాంతాలను సందర్శించనున్నారని వివరించారు. ఢిల్లీ సందర్శనలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవల యువ పురస్కారం అందుకున్న ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన ఉప్పాడ రేష్మ (శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల), ఎన్‌ఎస్‌ఎస్‌లో జాతీయ స్థాయి శిబిరాల్లో ప్రాతినిధ్యం వహించిన పలాస నియోజకవర్గానికి చెందిన బమ్మిడి రంజని (డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ-శ్రీకాకుళం), వికలాంగత్వాన్ని ఎదిరించి, విద్యలో రాణిస్తున్న టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఎన్.పవిత్ర ప్రియ (వమరవల్లి డైట్), జాతీయస్థాయి యూత్ పార్లమెంట్‌లో జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహించడంతో పాటు సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించిన పాతపట్నం నియోజకవర్గానికి చెందిన ముళ్ల సంధ్యారాణి (పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఉన్నారు.










