ప్రజాశక్తి-సీతంపేట: ఈ నెల 30న రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా రక్షణ బస్సుయాత్ర సీతంపేటలో ప్రారంభమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు తెలిపారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎ.భాస్కరరావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బస్సు యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వం వహిస్తారన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని పక్కన పెట్టి, బిజెపి విధానాలకు వత్తాసు పలుకుతున్నాయని ధ్వజమెత్తారు. వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, మండల కార్యదర్శి డి.రమణారావు, జగన్, భాస్కరరావు పాల్గొన్నారు.










