Sep 15,2023 22:21

చంద్రబాబు

సీట్ల 'పొత్తు'ఎలా..?
టిడిపిలో అంతర్మథనం
టిడిపి, జనసేన మధ్య రాజమండ్రి వేదికగా పొత్తు పొడిచింది.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించినప్పటి నుంచి టిడిపి చేస్తున్న 'నేను సైతం' దీక్షల్లో ఆ పార్టీ శ్రేణులు పాల్గొని సంఘీభావం ప్రకటిస్తున్నారు. పొత్తు హర్షనీయమని ప్రకటనలు చేస్తున్నారు. నాయకులు ఒకరికొకరు అండగా ఉందామని, కలిసి నడుద్దామని ప్రసంగాలు చేస్తున్నారు. అయితే 'పొత్తు' పొడిచినప్పటినుంచి టిడిపి, జనసేన ప్రధాన నాయకత్వంలో అంతర్మధనం మొదలయ్యింది. పొత్తు సరే, సీట్లు ఎలా అనేది వారి చింత. జనసేన ఇప్పటికే కొన్ని సీట్లు బలంగా కేంద్రీకరించి పని చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ రెండు మూడు సీట్లు ఆశించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గాలను నమ్ముకుని టిడిపి బలీయంగా ఉంది. ఇటీవల కాలంలో టిడిపిలో చేరిన వారు జనసేన వైపు నుంచి సీటు ఆశించే అవకాశం లేకపోలేదు.
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ ఉన్నాయి. జనసేన బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న మదనపల్లి, చిత్తూరు, తిరుపతి సీట్లను టిడిపి పొత్తు ఉంటే అడగాలని ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. తిరుపతి పార్లమెంట్‌ కూడా ఇవ్వాలని పట్టుబట్టనుంది. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన మధ్య పొత్తు పొడవడం, ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు రావడంతో మదనపల్లి ఇన్‌ఛార్జి రాందాస్‌ చౌదరిని, చిత్తూరులో డికె ఆదికేశవులునాయుడు తనయుడు డిఎ శ్రీనివాసును, తిరుపతిలో పవన్‌కల్యాణ్‌ లేదా పసుపులేటి హరిప్రసాద్‌, కిరణ్‌రాయల్‌ పోటీ చేయాలనే ఆలోచన ఉంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరులో బలిజ సామాజికవర్గం ఉండడంతో గెలుపు సునాయాసం అవుతుందని పవన్‌కల్యాణ్‌ ఆలోచన. తన అన్న చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలో పోటీ చేయగా సొంతూరులో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న తిరుపతి అసెంబ్లీకి పంపించారు. మొదటి ప్రాధాన్యత పవన్‌కల్యాణ్‌ తిరుపతినే ఆశించే అవకాశం ఉంది. తిరుపతి పార్లమెంట్‌ స్థానాన్ని పలువురు పోటీలో ఉన్నారు. టిడిపి నుంచి మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, పరసారత్నం, మాజీ ఎంఎల్‌ఎ నెలవల సుబ్రమణ్యం ఆశిస్తున్నారు. జనసేన తిరుపతి పార్లమెంట్‌పైనా కన్నేసి ఉంది. చంద్రబాబునాయుడు ఈ ముగ్గురు సీనియర్ల భవిష్యత్‌ ఏంటని చర్చ నడుస్తోంది. ఇప్పటికే మదనపల్లిలో మాజీ ఎంఎల్‌ఎ దొమ్మలపాటి రమేష్‌, కాంగ్రెస్‌ నుంచి వైసిపిలో చేరిన మాజీ ఎంఎల్‌ఎ బాషా కూడా టిడిపిలోకి వచ్చారు. అక్కడ వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. తిరుపతిలో మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ తనకే సీటు వస్తుందని ధీమాతో ఉన్నారు. టిడిపి రాష్ట్ర నాయకులు వూకా విజయకుమార్‌, ఇటీవలే టిడిపి కండువ ధరించిన టిటిడి బోర్డు మాజీ సభ్యులు ఒవి రమణ సీటు కోసమే వచ్చారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగితే టిడిపిలోనూ నేతల చీలిక వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే టిడిపి బిజెపితో పొత్తు ఉంటుందని అధికారికంగా ప్రకటించనప్పటికీ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బిజెపి కూడా తమతో కలిసొస్తుందని చెబుతున్నారు. బిజెపి, జనసేన పొత్తులో భాగంగానే తిరుపతి పార్లమెంట్‌ అడుగుతుంది. బిజెపి సైతం సత్యవేడు నియోజకవర్గం తమకు కేటాయించాలని అడుగుతోంది. ఏదిఏమైనా జనసేన, టిడిపి పొత్తు ఆయా పార్టీలో క్యాడర్‌ను ఉత్సాహపరచినప్పటికీ, నాయకత్వంలో మాత్రం అంతర్మధనం నెలకొంది.
చంద్రబాబు