Nov 15,2022 23:51

దట్టమైన మంచులో కాలకృత్యాలు తీర్చుకుంటున్న విద్యార్థులు

ప్రజాశక్తి- పెదబయలు : మండలకేంద్రంలోని వైటిసిలో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ముంచంగిపుట్టు ఈఎంఆర్‌ఎస్‌ ఏకలవ్య నోడల్‌ వసతి గహానికి చెందిన 300 మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రతిరోజూ కాలకృత్యాలకు నానా అవస్థలు పడుతున్నారు. ఐటిడిఎ అధికారుల ఆదేశాల మేరకు స్థానిక రెసిడెన్సియల్‌ హాస్టల్‌లో వసతిపొందుతూ, తరగతులకు వేరేచోట హాజరౌతున్న వీరంతా, ఇక్కడ ఉన్న ఒకేఒక చేతిపంపుతో ఉదయంపూట కాలకృత్యాలు తీర్చుకునేందుకు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవికాదు. దట్టంగా కురుస్తున్న పొగమంచులో, శీతల గాలులకు వణికిపోతూ, ఉన్న ఒక్కబోరు వద్దే పడిగాపులు పడుతూ, కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉన్నది ఒకటే బోరు కావడంతో తరచూ మరమ్మతులకు గురౌతోందని ప్రత్నామ్నాయంగా నీటి వసతి కల్పించాలని వీరు పెట్టుకున్న మొర అరణ్యరోదనగానే మిగిలిపోతోందని ఆవేదన చెందుతున్నారు. పొగమంచులో, చలికి వణుకుతూ, చాలాసేపు బోరు వద్ద ఉండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా ఐటిడిఎ అధికారులకు ఇదంతా ఎందుకు పట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.