Oct 17,2021 12:31

ఊహలకు రెక్కలొచ్చి.. అవి ఆకులై.. మొక్కలకు విచ్చుకుంటే ఎలా ఉంటాయో? అవే సీతాకోకచిలుక మొక్కలు. అందాన్ని, ఆశ్చర్యాన్ని, వింత అనుభూతుల్ని ఒకేసారి కలిగించే అపురూప మొక్క ఇది. 'క్రిస్టియా ఆబ్‌కార్డాటా' దీని శాస్త్రీయనామం. లెగిమినోసీయా కుటుంబానికి చెందిన ఈ మొక్కను 'బటర్‌ ఫ్లై ప్లాంటు' లేదా 'సీతాకోకచిలుక రెక్క' అని పిలుస్తారు. వీటిలో పదుల సంఖ్యలో రకాలున్నాయి. ఈ మొక్కల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.

ఆకులు త్రిభుజాకారంలో ఉంటాయి. అవి ఆకుపచ్చ, మరిన్ని రంగుల చారలతో అద్భుతంగా ఉంటాయి. మొక్క ఎనిమిది నుంచి 40 అంగుళాల వరకూ పెరిగి వాలిపోతుంది. వీటిని నేరుగా సూర్య కిరణాలు పడే ప్రాంతాల్లో కాకుండా నీడ, వెలుతురు ఉన్న ప్రాంతాల్లో ఉంచితే మొక్క నిగనిగలాడుతుంది. ఆర్గానిక్‌ మిశ్రమం ఉండే కొబ్బరి పొట్టులో ఇవి బాగా పెరుగుతాయి. ఈ మొక్కకు బాగా తడి, పొడి ఉండకుండా నీటివనరు సమానంగా ఉండాలి. సన్నని తీగల్లా ఉండే కొమ్మలు, అటూ ఇటూ త్రిభుజాకార పత్రాలను చూస్తే అచ్చంగా సీతాకోక చిలుకలు అక్కడ వాలినట్టుంటాయి. వారానికి రెండుసార్లు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఈ మొక్క ఏడాదికి 24 అంగుళాలు పెరుగుతుంది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయే తీగలను కత్తిరించి, షేప్‌ చేసుకుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి.
 

                                                                 లేతాకుపచ్చ మొక్క

సీతాకోకచిలుక మొక్కలు !

సీతాకోక చిలుకల్లో రంగులున్నట్టే ఈ మొక్కల ఆకుల్లోనూ అనేక రంగులున్నాయి. అన్నింటిలోకి నాజుగ్గా ఉండేది ఈ మొక్క. లేతాకుపచ్చ పత్రాల మీద చింతపిక్క రంగు చారలు.. త్రికోణాకారంగా ఉన్న పత్రాల మీద చాలా అందంగా ఉంటాయి. ఇది డ్వార్ప్‌ రకం కాబట్టి పొట్టిగా ఎదుగుతుంది. లైట్ల కాంతిలో మరింత అందంగా కనిపిస్తాయి. ఆకులు గాలికి ఊగుతూ ఉంటే సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు అనిపిస్తుంది.
 

                                                               ముదురాకుపచ్చ మొక్క

సీతాకోకచిలుక మొక్కలు !

ముదురాకుపచ్చ ఆకుల మీద లేత ఉదారంగు చారలను చూసినప్పుడు సీతాకోక చిలుకలే అక్కడ వాలినట్లు అనిపిస్తుంది. దీని మొక్క తీగలు చాలా వేగంగా పెరుగుతాయి. తెల్లటి పింగాణీ కుండీలో మొక్క మరింత అందంగా ఉంటుంది. ఇది తీగజాతి పొద మొక్క. తొలుత దీనిని అమెరికాలో కలుపు మొక్కగా భావించేవారు. తరువాత ప్రపంచమంతా విస్తరించింది.
 

                                                                   చిన్ని చిన్ని పూలు..

Butterfly plants!

ఈ మొక్క చాలాకాలం పెరిగిన తరువాత, చిన్ని చిన్ని పువ్వులు పూస్తాయి. పువ్వులు లేత నీలం, తెలుపు రంగుల కలబోతతో ఉంటాయి. వాటి కిందే విత్తనాలూ వస్తాయి. విత్తనాలు ఎండబెట్టి మట్టి పొరల్లో నాటితే వారం నుంచి 15 రోజులకు చిన్న మొక్కలు మొలుస్తాయి. అవి పెరిగితే బటర్‌ ఫ్లై ప్లాంట్లుగా తయారౌతాయి. ఇవి శీతాకాలం సీజన్లో పువ్వులు పూస్తాయి. వాటిని తుంచేస్తేనే మొక్క ఆకుల అందం కనిపిస్తుంది. మొక్క మొదలు భాగం నుంచి పాత ఆకులు వాడిపోతుంటే కొత్త ఆకులు చిగురిస్తాయి. అలాగే పక్క నుంచి కొత్త పిలకలు వస్తుంటాయి.
 

                                                             ఎర్రరెక్కల మొక్క..

సీతాకోకచిలుక మొక్కలు !

మొక్క ఆకులు ఎర్ర సీతాకోక చిలుకల్లా ఉంటాయి. కుదుళ్ళ నుంచి పత్రాలతో మొక్క కాడలను జాగ్రత్తగా తుంచి, వేరే కుండీల్లో నాటితే కొత్తమొక్కగా ఊపిరి పోసుకుంటాయి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి.
 

                                                        డబల్‌ కలర్‌ బటర్‌ ఫ్లై ప్లాంట్‌..

సీతాకోకచిలుక మొక్కలు !

మొక్క ఆకులు రెండు రంగుల సీతాకోక చిలుక రెక్కల్లా ఉంటాయి. పత్రాల చివర ముదురు నేరేడు రంగు, మధ్యభాగంలో లేత నేరేడు రంగుతో చూడ్డానికి అచ్చంగా సీతాకోక చిలుకల్లానే ఉంటాయి. ఈ మొక్క పొట్టిగా మట్టంగా ఎదుగుతుంది.
 

                                                                 మిడత బటర్‌ ఫ్లై మొక్క..

ఈ క్రిస్టియా ఆబ్‌కార్డాటా మొక్క ఆకులు కాస్త పొట్టిగా వెడల్పుగా ఉంటాయి. దీన్ని స్థానికంగా మిడత బటర్‌ ఫ్లై మొక్క అని పిలుస్తారు. వీటి ఆకులకు వాటర్‌ స్ప్రే చేస్తే నిగారింపుగా కనిపిస్తాయి.
 

                                                                   లీన్‌ వింగ్స్‌ ప్లాంట్‌..

Butterfly plants!

లీన్‌ వింగ్స్‌ ప్లాంట్‌ని తూనీగ ప్లాంట్‌ అని కూడా అంటారు. ఆకులు తూనీగ రెక్కల్లా సన్నగా పొడవుగా ఉంటాయి. ముదురు నేరేడురంగు ఆకుల మీద లేత నలుపు చారలు ఉంటాయి. మొక్క పొడుగ్గా పెరుగుతుంది.
 

                                                            గుంపు చిలుకలు మొక్క..

సీతాకోకచిలుక మొక్కలు !

ఈ బటర్‌ ఫ్లై మొక్క ఆకులు గుంపుగా దట్టంగా పెరుగుతాయి. సన్నని తీగలా పెరిగిన కణుపుకు చివరన మూడు సీతాకోక చిలుకల్లాంటి దళాలు ఉంటాయి. ఇవి నీలం రంగులో కుండీ నిండుగా పెరుగుతాయి. ఈ మొక్కను 'సీతాకోక చిలుకల గుంపు', 'బటర్‌ ఫ్లై బొకీ' అని పిలుస్తారు. వీటిని హ్యాంగింగ్‌ కుండీల్లో పెంచుకుని వేలాడదీసుకోవచ్చు. కాస్త నీడ తగిలే ప్రాంతంలో ఇంటి ప్రహారీ గోడల మీద, పెరట్లోనూ బోర్డర్‌ ప్లాంట్లుగానూ వీటిని పెంచుకోవచ్చు. ఇలా పెంచితే ఇంటికే సొగసు వస్తుంది.
 

                                                                క్రీపర్‌ బటర్‌ ఫ్లై ప్లాంట్‌..

సీతాకోకచిలుక మొక్కలు !

ఈ మొక్క తీగలుగా పెరుగుతుంది. చలువ పందిరలు, ప్రహరీ గోడలు, డాబా అంచుల మీద పాకించి, పెంచుకోవచ్చు. మొక్క చాలా తొందరగా పెరుగుతుంది. ఆకుపచ్చని ఆకుల మీద చింతపిక్క రంగు చారలు చూస్తుంటే సీతాకోక చిలుకలు ఒకేచోట గుంపుగా ఉన్నట్లు కనిపిస్తాయి.
 

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506