Nov 10,2023 17:20

గ్రామాభివృద్ధిలో గణేశ్న కుటుంబీకుల పాత్ర ఎనలేనిది
ప్రజాశక్తి - కాళ్ల

              నిస్వార్థం, మొక్కవోని దీక్షతో గ్రామాభివృద్ధికి గ్రామ సచివాలయానికి ఆరు సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చామని పంచాయతీ వార్డు సభ్యులు, వైసిపి మండల కన్వీనర్‌ గణేశ్న ఎన్‌విఎస్‌ఎస్‌ఎస్‌.నాయుడు(రాంబాబు) తెలిపారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సీసలి గ్రామాభివృద్ధిలో గణేశ్న కుటుంబీకుల పాత్ర 47 ఏళ్ల నుంచి ఉందన్నారు. 2021 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా బిల్వకుర్తి ధనలక్ష్మి, ఉప సర్పంచిగా బాతు మాణిక్యాలరావు ఎన్నికయ్యారని, తాను పంచాయతీ వార్డు సభ్యునిగా రెండోసారి గెలుపొందానని రాంబాబు చెప్పారు. తమ తాతయ్య గణేశ్న సత్యనారాయణమూర్తి నాలుగుసార్లు గ్రామ సర్పంచిగా సేవలందించారన్నారు. తమ పెదనాన్న గణేశ్న శ్రీరాంబాబు 1981 నుంచి 1987 వరకు సర్పంచిగా, 2006లో ఎంపిటిసి సభ్యునిగా పని చేశారని వివరించారు. తమ చిన్నమ్మ గణేశ్న సుబ్బలక్ష్మి 2006లో సర్పంచిగా పని చేశారని, ఆ సమయంలోనే తాను పంచాయతీ వార్డు సభ్యునిగా తొలిసారి గెలుపొంది గ్రామాభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వ నిధులు రూ.5 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని, నూతన భవనం నిర్మించడానికి స్థలం సరిపోలేదని చెప్పారు. గతంలో పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు ఐదు సెంట్ల స్థలాన్ని మా గణేశ్న కుటుంబీకులు ఇచ్చినట్లు తెలిపారు. మరో సెంటు స్థలాన్ని విరాళంగా ఇచ్చామన్నారు. ఇప్పటివరకు ఆరు సెంట్ల స్థలాన్ని పంచాయతీకి ఇచ్చినట్లు తెలిపారు. ఆ స్థలం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులు రూ.40 లక్షలతో జరుగుతున్న నూతన గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్‌, 15వ ఆర్థిక సంఘం నిధులు, సిఎం నిధులు సుమారు రూ.40 లక్షలతో ప్రత్యేక పైపులైన్‌ పనులు చేపట్టామన్నారు. ప్రతి ఇంటికి పైపులైన్‌ వేసి కుళాయి కనెక్షన్‌ ఇచ్చామన్నారు. పివిఎల్‌ నరసింహరాజు తాగునీటి పైపులను వదిలి ప్రారంభించారు. ఆ ప్రాంతంలో 70 గృహాలకు కుళాయిల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ గ్రామాభివృద్ధికి కషి చేస్తున్నామన్నారు. గ్రామంలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక పైపులైన్‌ పనులు చేపట్టామన్నారు. సీసలిలో రక్షిత మంచినీటి చెరువు ప్రక్షాళన పనులు 27 ఏళ్ల తర్వాత రూ.6 లక్షలతో చేపట్టామన్నారు.
రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణానికి రూ.22 లక్షలు, హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణ పనులకు రూ.17.50 లక్షలతో పనులు జరుగుతున్నాయన్నారు. సత్యనారాయణపురం ప్రాంతంలో పైపులైన్‌ పనులు రూ.2 లక్షలతో చేపట్టామన్నారు. సత్యనారాయణపురంలో నాడు-నేడు నిధులు రూ.22 లక్షలతో పాఠశాల భవనం, ప్రహారీ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొదటి విడత నాడు-నేడు నిధులు రూ.50 లక్షలతో హైస్కూల్‌ ఆధునికీకరణ పనులు చేపట్టామన్నారు. నాడు-నేడు నిధులుకోటి రూపాయలతో ఆరు అదనపు తరగతుల, భవనాల నిర్మాణ పనులు చేపట్టామన్నారు.
హరిజనపేటలో రూ.20 లక్షలతో సిమెంట్‌ రోడ్డు పనులు చేపట్టామన్నారు. సీసలి స్పెషల్‌ ప్రాథమిక పాఠశాలలో నాడు -నేడు నిధులు రూ.15 లక్షలతో, ప్రాథమిక పాఠశాల మెయిన్‌ పాఠశాలలో రూ.15 లక్షలతో నాడు -నేడు పనులు జరుగుతున్నాయన్నారు. వందమంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించి కోలనపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానాన్ని దాతల సహకారంతో అభివృద్ధి చేశామన్నారు. శ్మశానవాటికలో ఉన్న ఆక్రమణ తొలగించి రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు. ఐదో వార్డులో రూ.ఐదు లక్షలు, ఏడో వార్డులో రూ.15 లక్షలతో సిమెంట్‌ రోడ్డు పనులు చేపట్టామన్నారు. మండల పరిషత్‌ నిధులు రూ.10 లక్షలు, జెడ్‌పి నిధులు రూ.10 లక్షలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులు రూ.ఐదు లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో సిమెంట్‌ రోడ్డు పనులు చేయడానికి ప్రతిపాదనలు చేశామన్నారు. గ్రామంలో పాత పైపులైను తొలగించి జలజీవన్‌ పథకంలో ప్రత్యేక పైపులైన్‌ నిర్మాణానికి రూ.50 లక్షలతో పనులు చేయాల్సి ఉందని తెలిపారు.