Oct 04,2023 21:46

రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ నిరసన తెలుపుతున్న గిరిజనులు

ప్రజాశక్తి - కొమరాడ : మండలంలోని చినఖర్జేల పంచాయతీ సీసాడవలసకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. సీసాడవలస సమీపంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఈ పక్కనే గెడ్డను దాటి తమ గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. కోటా బియ్యం కూడా తమ గ్రామానికి రాని పరిస్థితి ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇద్దరు పిల్లలు ఈ గెడ్డలో కొట్టుకుపోగా గ్రామస్తులంతా కాపాడారన్నారు. కావున ఈ గ్రామానికి రహదారి సౌకర్యం ఇప్పటికైనా కల్పించాలని కోరారు. నిరసనలో గిరిజన సంఘం నాయకులు సంగమ్మ, సోములు, చిలకమ్మ, ఆ గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.