Mar 19,2023 01:02
నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా శనివారం బాపట్ల తాలూకా కార్యాలయం వద్ద రెవెన్యూ శాఖ, హౌసింగ్‌ శాఖ, ట్రెజరీ, సబ్‌ రిజిస్ట్రార్‌, ఎంపీడీవో తదితర శాఖల కార్యాలయాల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆయా సంఘాల నాయకులను, ఉద్యోగుల్ని ఉద్దేశించి ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ బాపట్ల జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ సిహెచ్‌ సురేష్‌బాబు, జిల్లా కోశాధికారి బి ఓంకార్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం మాకు కేటాయించిన బడ్జెట్‌లోని మొత్తాలను మాకు ఎందుకు చెల్లించదు అని ప్రశ్నించారు. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతగా ఉంటుందని ప్రభుత్వం వద్ద దాచుకున్న జీపిఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ తదితర డబ్బుల్ని కూడా రbకు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఈ సందర్భంగా ఆవేదన చెందారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులకి పిలుపునిస్తూ మన న్యాయమైన కోరికల పరిష్కారానికి మాత్రమే మనం ఉద్యమం చేస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఉద్యమం ప్రజల హక్కని, మనకు రావాల్సిన ఆర్థికపరమైన చెల్లింపులు, ఇతర సమస్యలు పూర్తిగా నెరవేర్చే వరకు ఈ ఉద్యమం ఆగదని, ప్రతి ఒక్క ఉద్యోగి చిత్తశుద్ధితో ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కవిత, డిప్యూటీ తహశీల్దారు శ్రీదేవి, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు పెరుగు శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి కె విజరుచంద్‌, కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, ఏ శివరామకృష్ణ, జి సాయి, పి శ్రీలక్ష్మి, డి శ్రీనివాసరావు, పి సురేష్‌ బాబు, డి వెంకటేశ్వరరావు ఎం రాజిమ్మ, వివిధ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన నాయకులు పాల్గొన్నారు.