Apr 18,2021 15:47

అవంతీపురం రాజ్యంలో వర్షాలు లేక విపరీతమైన కరువు వలన అక్కడి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దాంతో రాజు విమలాదిత్యుడు రాజ్యంలో పెద్ద చెరువును ప్రజల భాగస్వామ్యంతో తవ్వించాలని అనుకున్నాడు. ''ప్రజలందరూ ఒకపూట చెరువును తవ్వే పనికి వచ్చి, మిగిలిన పూట మీ పనులు చేసుకోండి!'' అంటూ దండోరా వేయించాడు.
ప్రజలందరూ ఉదయం పూట చెరువును తవ్వడానికి రావడం, మధ్యాహ్నం నుంచి వారి వారి పనులు చేసుకోసుకునేవారు. ఇలా కొన్ని రోజుల గడిచాయి. ఎంత తవ్వినా కానీ నీటిజాడ ఎక్కడా కనిపించలేదు! దాంతో నిరాశ చెందిన ప్రజలు క్రమ క్రమంగా చెరువును తవ్వడానికి రావడం మానేశారు. విషయం తెలుసుకున్న రాజూ ఏమీ చేయక ఊరుకున్నాడు.
కొంతకాలానికి దాదాపు అందరూ చెరువు వైపు రావటం పూర్తిగా మానేశారు. కానీ శీనయ్య మాత్రం ప్రతిరోజూ రావటం, ఉదయం నుంచి సాయంత్రం చీకటి పడేవరకు చెరువును తవ్వటం చేస్తూనే ఉన్నాడు. ''శీనయ్యా! నీకేమన్నా పిచ్చా, ఏమిటి? నీళ్ళు రానిచోట ఎంత తవ్వినా ఏం లాభం?'' అంటూ అందరూ హేళనగా మాట్లాడినా ఏమాత్రం పట్టించుకోకుండా ఓ నవ్వు నవ్వి, తనపని తాను చేస్తూనే ఉండేవాడు. నెలరోజుల తర్వాత ఓ రోజు ఎప్పటిలానే చెరువు తవ్వుతుండగా భూమి లోపల ఏదో గట్టిగా తగిలింది. అది పెద్దరాయి. శక్తినంతా ఉపయోగించి దాన్ని బయటకు తీశాడు. అంతే క్షణాల్లో ఆ రాయి ఉన్న స్థలం నుంచి నీళ్లు ఉబికి పైకి రావడం, కొద్ది గంటల్లోనే చెరువు అంతా నీటితో నిండిపోయింది. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేసరికి శీనయ్య ముఖంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
చెరువులో నీళ్లు పడ్డ విషయం కొద్దిసేపటిలోనే రాజుగారికి తెలిసింది. వెంటనే చెరువు దగ్గరకు బయలుదేరాడు. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసిన శ్రీనయ్యను అభినందించాడు. ''శీనయ్య మన రాజ్యానికి నీళ్ళు తెచ్చిన అపర భగీరథుడు'' అని పొగడ్తలతో ముంచెత్తాడు. అందరిలాగా శీనయ్యా నీళ్లు రావని వదిలేసి వెళ్లి ఉంటే ఈ రోజు మనం ఈ నీటిని చూసేవాళ్లం కాదు. కరువు నుంచి తప్పించుకునే వాళ్లమూ కాదు. మనలో చాలామంది ఏదైనా పని ప్రారంభించి, చిన్న అవాంతరం వస్తే ఆ పనిని మధ్యలోనే వదిలేయటం చేస్తాం. అలాకాకుండా ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా లెక్కచేయక ముందుకు సాగేవారే కచ్చితంగా విజయం సాధిస్తారు. అలాంటి విజేత మన శీనయ్య!'' అని రాజుగారు ఘనంగా సన్మానించారు. ఆ రోజు నుంచి ఆ చెరువును అందరూ ''శీనయ్య చెరువు''గా పిలుస్తున్నారు. నీళ్ళు పుష్కలంగా లభించడంతో పంటలు పండి, అతి తక్కువ కాలంలోనే అవంతీపురం సస్యశ్యామలమైంది.
 

- ఏడుకొండలు కళ్ళేపల్లి
9490832338