బెలగా:సీనియర్ సిటిజన్ల రక్షణకు అండగా ఉందామని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై జిల్లాస్థాయి కమిటీ మొదటి సమావేశం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లను గౌరవించాలి, వారికి రక్షణగా నిలవాలి, వారికి అవసరమగు సదుపాయాలు కల్పించాలని అన్నారు. సీనియర్ సిటిజన్ల జీవితం సాఫీగా సాగాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి నెల వారీ జీవనానికి ఎటువంటి ఆటంకాలు ఉండరాదని వారి నిర్వహణకు అవసరమైన అన్ని వనరులు సమకూరాలని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్ల హక్కులు పరిరక్షించాలని చెప్పారు. జిల్లాలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కేసులు, తల్లిదండ్రుల ఆస్తులు అన్యాక్రాంతం చేసిన కేసుల అర్జీలు అందాయన్నారు. వీటిపై రెవెన్యూ డివిజనల్ అధికారి తక్షణం చర్యలు చేపట్టి ఆస్తులను అప్పగించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులకు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సహకారం అవసరమన్నారు. కార్యాలయాల్లో సీనియర్ సిటిజన్లకు స్నేహపూరిత వాతావరణం ఉండాలని ఆయన ఆదేశించారు. దేవాలయాలు ఇతర ప్రదేశాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూ - లైన్లు ఉండాలని, పోలీస్ పెట్రోలింగ్‌లో సీనియర్ సిటిజన్లు ముఖ్యంగా ఒంటరిగా ఉండే గృహాలు తదితర అంశాలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లను గౌరవించడం, వారి హక్కులను రక్షించడం మన బాధ్యత అని ఆయన అన్నారు. సీనియర్ సిటిజన్, రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ మంచు శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశంలో అన్ని దేవాలయాల్లో ప్రత్యేక క్యూ - ఉండాలని, తల్లిదండ్రులను బాధ్యతగా చూడని కుమారులపై చర్యలు తీసుకోవాలని చర్చించామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథ రావు, డిఆర్‌డిఎ, డ్వామా పీడీలు పి.కిరణ్‌కుమార్, కె.రామచంద్ర రావు, జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, సీనియర్ సిటిజన్లు గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.










