రాయలసీమకు కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లలో ఎంతో ద్రోహం చేస్తూ వచ్చింది. విభజన చట్టంలో ఇచ్చిన బాధ్యతలనూ, పాలక ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా కలసి ఇచ్చిన రాజకీయ హామీలనూ మూలన పడేస్తూ వచ్చింది. అందుకే కేంద్రం లోని బిజెపి ప్రభుత్వానికి తీవ్ర నిరసన చెప్పడానికి ఈనెల 27వ తేదీన భారత్ బంద్ ఒక వేదిక కావాలి. వందలాది రైతు సంఘాలిచ్చిన బంద్ పిలుపునకు కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు, పార్టీలు స్పందించి సమాయత్తం అవుతున్నాయి. హిందూత్వ-కార్పొరేట్ యంత్రాంగానికి ఎదరు నిలిచే శక్తులన్నీ కలిసొస్తున్నాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి డిమాండ్లు కూడా ఈ బంద్‌లో వినపడాల్సిన అవసరముంది.
విభజన చట్టాన్ని చిత్తశుద్ధితో రాజకీయ సంకల్పంతో అమలు చేసి ఉంటే రాయలసీమ అభివృద్ధికి కొంతైనా ప్రాతిపదిక ఏర్పడి ఉండేది. కేంద్ర ప్రభుత్వం కెబికె, బుందేల్‌ఖండ్ తరహాలో ఒక స్పెషల్ అభివృద్ధి ప్యాకేజీని రాయలసీమకు ఇచ్చి ఉండాలి. అట్లా ఇచ్చి ఉంటే ఒక 13 వేల కోట్ల రూపాయల దాకా సీమ అభివృద్ధికి దక్కి ఉండేది. కాని సాంకేతిక కారణాలు చూపించి కేంద్రం అసలు వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీనే లేదని అడ్డం తిరిగింది. మూడేళ్లకుగానూ ఒక రూ.500 కోట్లు విదిలించి చేతులు కడుక్కొంది. చివరి దఫాలో ఇచ్చింది ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు లాక్కొంది. ఇంతకంటే సీమ వ్యతిరేక వైఖరి ఉంటుందా?
విభజన చట్టంలో చెప్పిన ఇతర అంశాలకైనా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సీమ ప్రజలు ఆశగా ఎదురు చూశారు. కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందనుకున్నాం. అది..ఇది..చెప్పి లాభదాయకం కాదని చెప్పి కేంద్రం చివరలో చేతులెత్తేసింది.హక్కుగా నిలదీసి సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మారు మాట్లాడకుండా ప్రైవేటు సంస్థ కోసం ప్రయత్నిస్తోంది. చిత్తూరు జిల్లాలోని మున్నవరం ప్రాజెక్టు కాని, కర్నూలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరిస్థితి కానీ అరకొరగానే ఉన్నాయి. రాయలసీమ పారిశ్రామికీకరణనూ, ఉపాధిని పెద్ద ఎత్తున ప్రేరేపించగల ఇటువంటి ప్రాజెక్టుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమార్హం కాదు.
విభజన చట్టం ద్వారా అనేక కేంద్ర విద్యా సంస్థలు రాయలసీమకు కేటాయించబడ్డాయి. వీటిని చాలాకాలం పట్టించుకోని కేంద్రం ఆ తరువాత ప్రజల, సంఘాల ఒత్తిడిని తట్టుకోలేక కొన్నింటిని ప్రారంభించింది. కాని ఇప్పటికీ మౌలిక వసతులు, నిధులు పూర్తి స్థాయి ఉద్యోగ, అధ్యాపక బృందాలను నియమించడం లాంటి పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అనంతపురం లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎందుకు చేరామా అని ఇతర రాష్ట్రాల విద్యార్థులు అందరి దగ్గర గోడు వెళ్లబోసుకునే పరిస్థితి. హిందూపురం దగ్గర 'నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్'ను అరుణ్ జైట్లీ తదితరులు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లినా ఇంత వరకూ అతీగతీ లేదు.
కర్నూలులో హైకోర్టుకు రాజకీయ పార్టీలన్నింట్లో దాదాపు ఏకాభిప్రాయం వుంది. ఉన్నత న్యాయస్థానాలతో సంప్రదింపులు జరిపి దీన్ని ఒక కొలిక్కి తేవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మాట్లాడటమే తప్ప ముందడుగు పడటం లేదు. కర్నూలులో కూర్చొని సాంకేతికంగా రాయలసీమ డిక్లరేషన్ విడుదల చేసిన రాష్ట్ర బిజెపి...మాటలు తప్ప చేతలు చూపడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన జలజగడాన్ని బూచిగా చూపి...విభజన చట్టం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని... ప్రాజెక్టులపై పెత్తనాన్ని మాత్రం కేంద్రం హస్తగతం చేసుకుంది. అయితే రాయలసీమకు న్యాయం జరుగుతుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి.రాయలసీమ వ్యవసాయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కర్నూలులో ఉల్లి రైతు, మదనపల్లిలో టమోట రైతు, చిత్తూరులో మామిడి రైతు, అనంతపురంలో వేరుశనగ రైతు, కడపలో పసుపు రైతు, సీమ అంతటా హార్టీకల్చర్ రైతులు గిట్టుబాటు ధర లేక, మార్కెట్ వసతులుండక అల్లాడుతున్నారు. అనంతపురంలో ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డా, సాగు విస్తీర్ణం సగానికి సగం పడిపోయింది. వ్యవసాయం నుంచి రైతులు నిష్క్రమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు స్వాగతం పలుకుతోంది. దీన్ని నిలువరించడానికి జరుగుతున్న రైతు ఉద్యమంలో సీమ ప్రజలు భాగస్వాములవ్వాలి. ఈ మధ్య రాయలసీమ లోకి ప్రమాదకరమైన మతతత్వ రాజకీయాలను బిజెపి ప్రవేశ పెడుతోంది. పొద్దుటూరులో టిప్పు విగ్రహం వివాదం, కర్నూలులో తుంగభద్ర పుష్కరాలు, వినాయక నిమజ్జన వివాదం, శ్రీశైలంలో వ్యాపారుల వివాదం, తిరుమలలో అన్యమత వివాదం లాంటి అంశాలపై రాజకీయ సమీకరణలకు సిద్ధపడుతోంది. ఆ విధంగా సీమ అభివృద్ధిపై జరగాల్సిన చర్చలను దారి మళ్లిస్తున్నది. ఇంత జరుగుతున్నా అటు వైఎస్‌ఆర్‌సిపి గాని ఇటు టిడిపి కానీ బిజెపి రాజకీయాలను నిలువరించే ప్రయత్నం చేయడంలేదు. కేంద్రాన్ని ప్రశ్నించడానికి సాహసించడం లేదు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ముందుకు తెస్తున్న హిందూత్వ కార్పొరేట్ ఎజెండాతో రాజీ పడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనకూల విధానాలు రైతులకే కాదు, వెనుకబడ్డ ప్రాంతాల ప్రయోజనాలకూ ముప్పును తెస్తాయి. అందుకే సీమ ప్రజలందరూ బంద్‌లో పాల్గొనాలి. సీమకు కేంద్రం చేసిన ద్రోహం ఒక అదనపు కారణంగా ఉంటుంది.
డా. గేయానంద్ - /వ్యాసకర్త - రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ /










