చీఫ్ ఇంజనీర్ బొడ్డు శ్రీధర్
ప్రజాశక్తి -సీలేరు
సీలేరు కాంప్లెక్స్‌లో అభివృద్ధి పనులకు జెన్కో యాజమాన్యంతో పోరాడి నిధులు సాధించుకుంటామని ఎపి జెన్కో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ బొడ్డు శ్రీధర్ తెలిపారు. కార్మికులు సంక్షేమ గురించి కషి చేస్తానని చెప్పారు. సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్‌గా ఈనెల 23న బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ బుధవారం స్థానిక జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకున్న పరిజ్ఞానం, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సీలేరులో 9 యూనిట్లతో 1350 మెగావాట్ల సామర్థ్యం గల పంపు స్టోరేజ్ ప్రాజెక్టు నెలకొల్పడానికి ఉన్నత అధికారులు సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్‌గా నియమించినట్లు వెల్లడించారు. ఏపీ జెన్కో శ్రీశైలం హైడల్ ప్రాజెక్ట్ లెఫ్ట్ రైట్ బ్యాంకులో 12 సంవత్సరాలపైనే ఏడిఈగా, డిఈగా విధులు నిర్విర్తించినట్లు చెప్పారు. విజయవాడ విద్యుత్ సౌద హెడ్ క్వార్టర్‌లో చీఫ్ జనరల్ మేనేజర్ ఏడీఎంగా పని చేసినట్లు తెలిపారు. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 5, 6 యూనిట్లు నూతనంగా నెలకొల్పబోయే పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఎప్పుడో పూర్తయిందని పేర్కొన్నారు. యూనిట్లు నెలకొల్పే ప్రదేశంలో క్లీనింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, యూనిట్ నిర్మాణం పనులు కంపెనీకి అప్పగించారని చెప్పారు.
జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన చీఫ్ ఇంజనీరు
స్థానిక జల విద్యుత్ కేంద్రాన్ని బుధవారం చీఫ్ ఇంజనీరు శ్రీధర్ సందర్శించారు. ఎస్‌ఇ సివిల్ కెకెవి.ప్రశాంత్ కుమార్, ఈఈలు జాకీర్ హుస్సేన్ లక్ష్మీనారాయణ, కార్మిక సంఘ నాయకులు వై.దార్రాజు, ఇవివి సత్యనారాయణ, నాగరాజు తదితరులు చీఫ్ ఇంజనీర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జెన్కో ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కార్మికులతో జల విద్యుత్ కేంద్రంలో సమావేశమయ్యారు. ఈఈ లక్ష్మీనారాయణ జల విద్యుత్ కేంద్రంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి పనుల గురించి చీఫ్ ఇంజనీర్‌కు వివరించారు. ఇంజనీర్లు, కార్మికుల సమస్యలను చీఫ్ ఇంజనీర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులకు హాజరవుతూ హెల్మెట్, ఐడి కార్డ్, యూనిఫారం తూచా తప్పక పాటించాలని ఆదేశించారు. అనంతరం జల విద్యుత్ కేంద్రంలో ఉన్న నాలుగు యూనిట్లు పనితీరును పరిశీలించారు. రెగ్యురేటరీ డ్యాం, మెయిన్ డ్యాం, ఇంటెక్ డ్యాంలో నీటి నిల్వలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్యాం అండ్ పవర్ హౌస్ ఏడిఈ అప్పలనాయుడు, ఏఈ క్యాంపు సురేష్, మోతుగూడెం ఈఈ బాబురావు, ఎలక్ట్రికల్ ఏడిఈలు జె.సత్యనారాయణ వి.సూర్య కుమార్, మెకానికల్ ఏడిఈ బి.క్రాంతి, ఏఈలు రమేష్, సీతారాం, నాగబాబు, ఇంజనీర్లు, కార్మికులు పాల్గొన్నారు.










