Jul 28,2022 23:38

అధికారులతో సమీక్షిస్తున్న జివిఎంసి కమిషనర్‌ లక్ష్మీశ

ప్రజాశక్తి-విశాఖపట్నం : మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ప్రజారోగ్యపు అధికారులను ఆదేశించారు. జివిఎంసి సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకొనే చర్యలపై ఉన్నతాధికారులు, ప్రజారోగ్యపు అధికారులతో గురువారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, నగరంలో సీజనల్‌ వ్యాధులు అధికంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి వార్డులో ర్యాపిడ్‌ టీమ్‌ లను ఏర్పాటు చేసి ఫాగింగ్‌, స్ప్రేయింగ్‌ ప్రతి రోజూ చేయించాలని, ప్రతి జోన్‌ లోనూ, వార్డులో ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో సీజనల్‌ వ్యాధులపై తీసుకున్న చర్యలు ప్రధాన కార్యాలయంలో తెలియపరచాలని, ప్రతి సచివాలయ పరిధిలో ప్రజలకు డెంగీ, మలేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చైతన్య వంతులుగా చేయాలని ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన సీజనల్‌ వ్యాధులపై ప్రత్యేకంగా వార్డులలో సమావేశమై తీసుకోవాల్సిన చర్యలు చర్చించాలని, నగరంలో డెంగీ కేసులు వస్తే, ఆ వార్డు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డెంగీ కేసు నమోదైన ప్రాంతంలో 200 మీటర్ల వరకు స్ప్రేయింగు, ఫాగింగ్‌ సామగ్రి తగినంత నిల్వవుంచుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు పాల్గొన్నారు.