ప్రజాశక్తి-గుంటూరు : సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిసరాలు పరిశుభ్రంగా వుంచడంతో పాటు శుద్ధి చేసిన తాగునీటిని సక్రమంగా సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ, పంచాయతీ, మున్సిపల్ శాఖాధికారులను జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పాఠశాలల్లో నాడు-నేడు పనులు, మహిళా శిశు సంక్షేమం, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో జ్వరాలు, అతిసార, మలేరియా, డెంగీ, టైఫాయిడ్, ఇతర అంటు వ్యాధులు రాకుండా వైద్య సిబ్బంది ద్వారా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని సక్రమంగా నిర్వహించాలని, చెత్తను రోజూ సేకరించి డంపింగ్ కేంద్రాలకు తరలించాలని చెప్పారు. రక్షిత నీటి సరఫరా పథకం ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకొకసారి శుభ్రం చేయాలని, నీటిని క్లోరినేషన్ చేయాలని అన్నారు. రక్షితనీటి సరఫరా పథకం పైపు లైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజీలుంటే మరమ్మతులు వెంటనే నిర్వహించాలని, పబ్లిక్ కుళాయిల వద్ద చేతి పంపుల వద్ద అపరిశుభ్రత లేకుండా నిరంతరం పారిశుధ్య పనులు చేయాలని ఆదేశించారు. నివాస ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల ద్వారా వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, దోమల ద్వారా వచ్చే వ్యాధులపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా కరపత్రాలు, పోస్టర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. జెవికె కిట్లను విద్యార్థులు రోజు స్కూల్‌కు తీసుకొచ్చేలా చూడాలని, విద్యార్థులందరు మధ్యాహ్న భోజనం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, మన బడినాడు-నేడు రెందో దశ క్రింద చేపడుతున్న మౌలిక వసతుల కల్పన పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలను సెప్టెంబర్ నాటికి పూర్తయ్యేలా చూడాలన్నారు. అమ్మఒడి నిధులు జమకాని వారి వివరాలను సేకరించి వారి ఖాతాలకు జమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, సిపిఒ శేషశ్రీ, ఐసిడిఎస్ పీడీ మనోరంజని, డిఇఒ శైలజ, డిపిఒ కేశవరెడ్డి, డిఎం అండ్ హెచ్ డాక్టర్ శ్రావణబాబు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ ఇ.అన్నపూర్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
సమీక్షలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి










