జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి
ప్రజాశక్తి-రంపచోడవరం
ప్రస్తుత వర్షాకాలంలో దోమల ద్వారా ప్రబలే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికన్ గున్యా వ్యాధులపై ప్రజలకు అవగాహన, అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని జోనల్ మలేరియా అధికారి డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి ఆదేశించారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని సహాయ మలేరియా అధికారి, విబిడి కన్సల్టెంట్, సబ్ యూనిట్ అధికారులు, మలేరియా టెక్నికల్ సూపర్ వైజర్లతో సమీక్ష సమావేశం స్థానిక ఐటిడిఎ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ మలేరియా అధికారి మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ ఏరియాలో రెండో విడత ఐఆర్‌ఎస్ చేయడం, అన్ని హాస్టళ్లలో ఫోకల్ స్ప్రే (క్రిమి సంహారక మందు పిచికారీ) చేయించడం, ఫీవర్ సర్వే, లార్వా సర్వే, దోమ లార్వా ఉన్నచోట యాంటీ లార్వాల్ ఆపరేషన్స్ చేయడం, బయోలాజికల్ కంట్రోల్ చేయుటకు గంబూసియా చేపలను చెరువుల్లో, కొలనుల్లో విడుదల చేయడం కోసం సత్వర ప్రణాళికతో కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన సదస్సులు, ఇంటి ఆవాసల దగ్గర్లోని కాలువలలో చెత్త, చెదారం వేయకుండా ఆచరణ నియమావళిలో మార్పు రావడం చేసేలా చూడాలని సూచించారు.










