Jul 19,2023 00:24

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ జగదీశ్వరరావు

ప్రజాశక్తి-సీతమ్మధార : సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ తదితర వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులకు డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ పి.జగదీశ్వరరావు సూచించారు. డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో వైద్యాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, కుటుంబ నియంత్రణ పాటించాలని సూచించారు. కుటుంబ డాక్టర్‌ విధానం అన్ని వైఎస్‌ఆర్‌ క్లినిక్స్‌లో షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలన్నారు. ఎన్‌సిడిసిడి సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫీవర్‌ సర్వే చేసి, మలేరియా, డెంగీ వ్యాధులను గుర్తించి వెంటనే తెలియపరచాలని కోరారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించడానికి వాతావరణ అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఫీవర్‌ సర్వే నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షక వైద్యాధికారులు పాల్గొన్నారు.