ప్రజాశక్తి-గాజువాక : సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన తప్పనిసరి అని గాజువాక జోనల్ కమిషనర్ సింహాచలం అన్నారు. బీసీ రోడ్డు, భానోజీ తోట, దుర్గాదేవి ఆలయాల వద్ద గురువారం డెంగీ నివారణ, తడి పొడి చెత్తపై వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తూ సమీప దుకాణాదారుల నుంచి యూజర్ ఛార్జీలను వసూలు చేశారు. చెత్తను ఇష్టానుసారంగా రోడ్లపై వేయకూడదని, డస్ట్ బిన్లలో మాత్రమే వేయాలని సూచించారు. డెంగీ, మలేరియా, చికున్ గున్యా, సాధారణ జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్న దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా డస్ట్‌బిన్‌లలో వేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లోకనాధం, మద్దాల మణికంఠ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అప్పారావు, మంగునాయుడు, టి.రాంబాబు, అర్జున్, ఎల్ వెంకటరావు, సుందరరావు, కొండలరావు, నారాయణ మూర్తి, అడిగర్ల రమణ, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










