ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఈగలు దోమల సంఖ్య పెరిగి సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో లోకుల యాదగిరిశ్వరరావు ఆదేశించారు. మండలంలోని లాగరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఎంపిడిఒ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పిహెచ్‌సిలో రికార్డులు, వార్డు, వసతులు, మందులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాగరాయి గ్రామంలో ఇటీవల మలేరియా సోకిన బాధితుడిని ఎంపీడీవో పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మలేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో గ్రామంలో దోమల నివారణ మందు పిచికారీ చేయాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు పిహెచ్‌సి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, వైద్య సిబ్బంది పిహెచ్‌సిలో రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లాగరాయి సర్పంచ్ మిర్యాల గణలక్ష్మి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బొడ్డు వెంకటరమణ, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుష్మ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ పాల్గొన్నారు.










