ప్రజాశక్తి - కలెక్టరేట్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన ఛాంబర్‌లో జివిఎంసి కమిషనర్‌తో కలసి వైద్యారోగ్య శాఖ అధికారులతో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. పూల కుండీలు, కొబ్బరి బొండాలు, టైర్లు, ఖాళీ సీసాలు, ఫ్రిడ్జ్ వెనుక భాగంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. డెంగీ దోమ మంచినీటిలోనే పుడుతుందని, సాయంత్రం వేళ ప్రజలు కిటికీలు మూసు కోవాలని లేదా దోమ తెరలు వాడాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించాల న్నారు. ఎఎన్‌ఎంలు, ఆశాలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి డెంగీపై అవగాహన కల్పించాలన్నారు. దోమల నిర్మూలనకు అవసరమైన సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకో వాలన్నారు. వర్షాల సమయంలో నీటి నిల్వలు ఎక్కువ ఉండకూడదని, వర్షం పడిన మరుసటి రోజున ముఖ్యంగా ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన నీటి నిల్వలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇంటి పై కప్పు భాగంలో నీటి నిల్వలు లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సెప్టిక్ ట్యాంక్ గాలి గొట్టాల్లో దోమలు వృద్ధి చెందకుండా జాలీలను అమర్చాలని తెలిపారు. వాటర్ హెడ్ ట్యాంకులపై తప్పనిసరిగా మూతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాబోయే నాలుగు నెలలు చాలా కీలకమని, క్షేత్రస్థాయి సిబ్బందితో తరుచూ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు.










