Nov 16,2023 22:15

10 రోజుల కార్యాచరణ మేరకు క్షేత్రస్థాయిలో పనులు: కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
నగరంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు నిర్దేశించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం పటిష్టచర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నగరంలో నీటి సరఫరా, క్లోరినేషన్‌, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై కమిషనర్‌ గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు చేశారు. పొన్నియమ్మ గుడి వీధిలో సరఫరా అవుతున్న నీటికి క్లోరిన్‌ పరీక్షలు నిర్వహించారు. నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటికి తప్పనిసరిగా క్లోరినేషన్‌ చేయాలని, అమినిటీ కార్యదర్శులు రోజూ వార్డు పరిధిలో నీటి సరఫరాను పర్యవేక్షించడంతో పాటు, నీటిలో క్లోరిన్‌ శాతాన్ని పరీక్షించాలని, లీకేజీలు లేకుండా అరికట్టాలన్నారు. అనంతరం నగరపాలక సంస్థ టీఎల్‌ఎస్‌ఆర్‌ పంపింగ్‌ స్టేషన్‌, నీటి సరఫరాను తనిఖీ చేశారు. నీటిలో క్లోరిన్‌ శాతం, రికార్డులను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టాలని కమిషనర్‌ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణలో భాగంగా ముందస్తుగా నిర్దేశించిన 10రోజుల కార్యాచరణ మేరకు చేపడుతున్న పనులను కమిషనర్‌ తనిఖీ చేశారు. గ్లోరీ గార్డెన్‌ వద్ద నిల్వచేరిన నీటిలో ఆయిల్‌బాల్స్‌ వేశారు. పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. తడి, పొడి వ్యర్ధాల సేకరణ, వేర్వేరుగా తరలింపు జరుగుతుందా లేదా తనిఖీ చేశారు. చెత్త తరలించే వాహనాల రికార్డులను పరిశీలించారు. డ్రైనేజీ కలలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, దోమల నియంత్రణకు ఆయిల్‌బాల్స్‌ వేయాలని, స్ప్రేయింగ్‌ పక్కాగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, వసతి గహాలు, ఆసుపత్రుల వద్ద ఫాగింగ్‌ చేయాలన్నారు. అలాగే నగరంలో చేపట్టిన ఇంజనీరింగ్‌ పనులను కమిషనర్‌ గురువారం ఉదయం తనిఖీ చేశారు. స్మార్ట్‌రోడ్డులో భాగంగా కొంగారెడ్డిపల్లి మార్గంలో డివైడర్లలో మొక్కలు పెంచాలని, సెంట్రల్‌ లైటింగ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సాంబయ్య కంటికి వద్ద డివైడర్‌ ఎక్స్టెన్షన్‌ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మురుకంబట్టు వద్ద డివైడర్ల పెండింగ్‌ ఉన్న గ్రీనరీ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ చెల్లముత్తు, ఎంఈ గోమతి, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, డీఈలు వెంకట ప్రసాద్‌, రమణ, సానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య, ఏఈలు లోకేష్‌, రజని, రవీంద్ర, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.