సీఎంకు గౌరవం లేదు: కిరణ్ రాయల్
పట్టువస్త్రాల సమర్పణపై జనసేన వ్యాఖ్యలు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
తిరుమల శ్రీవారి బ్రహ్మౌత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హౌదాలో ఉన్న వ్యక్తులు సతీ సమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయంపై ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి తిరుమల శ్రీవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నా ఆయన హిందూ సాంప్రదాయం పట్ల ఏమాత్రం గౌరవం లేనట్టుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఆలయంలో వేద పండితులు మంత్రోచ్ఛారణతో అక్షింతలు చల్లుతుంటే వెంటనే దులుపుకోవడం రాష్ట్ర ప్రజలు, శ్రీవారి భక్తులు గమనిస్తూనే ఉన్నారన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని టిటిడి ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరించారని, టీటీడీ అంటే ఆయన సొంత జాగీరుగా అనుకుని వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. జనసేన పార్టీ అధినేత పై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తమ పవన్ కళ్యాణ్ అధినేత పట్ల దురుసైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం ప్రారంభిస్తున్న శ్రీనివాస సేతు కార్యక్రమాన్ని తిలకించడానికి తిరుపతి నగర ప్రజలు అక్కడకు చేరుకుంటే అధికారులు అనుమతి ఇవ్వలేదని, అయినా శ్రీనివాస సేతును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని, ప్రజలు దీనిపై నవ్వుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్పొరేటర్ ఆర్సి మునికష్ణ, జనసేన పార్టీ నాయకులు హేమ కుమార్, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, గుట్టా నాగరాజు రాయల్, వంశి తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కిరణ్‌రాయల్










