ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి
అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం బ్రాండెక్స్ అపెరల్ సిటీలోని సీడ్స్ వస్త్ర పరిశ్రమ ప్రమాదంపై నివేదిక బహిర్గతం చేయడం లేదు. రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు ప్రమాదం జరిగినా, ప్రమాద కారణాలపై గోప్యత ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం, ఒత్తిడితో అధికార యంత్రాంగం ప్రమాద వివరాలను, విచారణ నివేదిక సారాంశం చెప్పడానికి సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. సీడ్స్ కంపెనీలో ఈ ఏడాది జూన్ 3న విషవాయువులు విడుదలతో 369 మంది కార్మికులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. ఈ ప్రమాద కారణాలు తెలుసుకొనేందుకు సీడ్స్ కంపెనీలో విడుదలైన విషవాయువుల శాంపిల్స్‌ను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి)కి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పంపారు. మరోవైపు ప్రమాదంపై విచారణకు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి నేతృత్వంలో కమిటీని కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి నియ మించారు. ఐఐసిటి నివేదిక జూన్ 10న వచ్చినప్పటికీ ఆ వివరాలు వెల్లడించలేదు. నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు కలెక్టర్ పట్టాన్‌శెట్టి తెలిపారు. ఐఐసిటి నివేదిక ఆధారంగా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికనూ బహిర్గతం చేయలేదు. రెండు నివేదికల వాస్తవాలను బహిర్గతంచేసి ప్రమాద కారణాలు వెల్లడించాలన్న డిమాండ్ వస్తుండగానే, ఆగస్టు 2న రెండోసారి ఇదే కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. తొలిసారి జరిగిన ప్రమాద కారణాలు గుర్తించి సరిచేసివుంటే, రెండోసారి ప్రమాదం జరిగే అవకాశం వుండేదికాదన్న వాదన వుంది. ఆగస్టు 2న విషవాయువులు విడుదలతో 150 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. రెండోసారి జరిగిన ప్రమాదంపై విడుదలైన వాయువుల శాంపిల్స్‌ను ఐఐసిటికి పంపించినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. దీంతో పాటు వాయువుల విడుదలపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) బృందం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) బృందం పరిశీలన జరిపాయి. అయినా ఇంతవరకు ప్రమాద నివేదికలు వెల్లడించలేదు. సీడ్స్ కంపెనీలో రెండుసార్లు జరిగిన ప్రమాదంపై నివేదిక వెల్లడించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకొని, ప్రమాదాలు పునరావృతం కాకుండా గట్టి ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు.










