Jul 29,2023 21:27

రైతులకు విత్తనాలను అందజేస్తున్న జమ్మయ్య

ప్రజాశక్తి గుమ్మలక్ష్మీపురం : మండలంలోని గొరడలో శనివారం మా తోట జీవ ప్రాజెక్ట్‌ పరిధిలోని గొరడ ,రాయగడ జమ్మూ, పెంగవ, వల్లాడ గ్రామాలకు చెందిన 40 మందిరైతులు దేశి విత్తనాలు ప్రదర్శన మరియు విత్తన మార్పిడిపై ( సీడ్‌ మేళా) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మా తోట జీవ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు జమ్మయ్య మాట్లాడుతూ పైలెట్‌ ప్రాజెక్టు కింద రైతులు తమ యొక్క మొత్తం విస్తీర్ణంలో ఏడాది పొడవునా పంటలు పండించుకోవాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యపడుతుందన్నారు. పండ్ల తోటల్లో అంతర్‌ పంటలుగా పసుపు, అల్లం, పైనాపిల్‌, ఆకుకూరలు, కాయగూరలు, గడ్డి విత్తనాలు వేసుకోవడం వల్ల అదనపు ఆదాయం లభించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు లభించడంతో పాటు, వాటిని ఉపయోగించుకోవడం వల్ల పౌష్టికాహారం లభిస్తుందని, నాబార్డ్‌ ఆర్థిక సహకారంతో జట్టు సంస్థ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహించడం నిజంగా అభినందించి దగ్గ విషయమని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీరంతా మిగతా మాతోట రైతులకు ఒక ఆదర్శవంతంగా నిలవాలన్నారు. రైతులు పండించిన దేశీ విత్తనాలను ప్రదర్శించడం, విత్తన మార్పిడి చేసుకోవడం జరిగినది. ఇలా చేసుకోవడం వల్ల దళారుల బెడద లేకుండా మన విత్తనం మంచి విత్తనం వల్ల మొలక శాతం పెరుగుదలతో పాటు దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని అన్నారు. అనంతరం రైతులకు కొర్రలు, సామలు విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాతోట జీవ కార్యదర్శి కె. చిరంజీవులు, సభ్యులు పెకాపు మురళి, కోఆర్డినేటర్లు జి.ప్రబోద్‌, జి.మురళీమోహన్‌, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.