ప్రజాశక్తి-చింతూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహకారాలతో చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)లో శుక్రవారం నుండి ఎముకల శస్త్ర చికిత్సలు ప్రారంభించినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంవి.కోటిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గతంలో జిల్లా కలెక్టర్ చింతూరు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించినప్పుడు చెవి, ముక్కు, గొంతు, ఎముకలు శస్త్ర చికిత్సలు చేయడానికి కావాల్సిన పరికరాలపై ఆరా తీశారని తెలిపారు. వాటి కొనుగోలుకు రూ.10 లక్షల వరకు అవుతుందని చెప్పడంతో కలెక్టర్ రూ.10 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. పరికరాలు కొనుగోలు అనంతరం శుక్రవారం శస్త్ర చికిత్సలు ప్రారంభించినట్లు చెప్పారు. విఆర్.పురం మండలం సోమలగూడెం గ్రామానికి చెందిన మిడియం కృష్ణకు ప్రమాదంలో మోచేతి ఎముక విరిగి పోగా, ఆయనకు శుక్రవారం ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. ఓరిఫ్ పద్ధతి ద్వారా కౌశిక్, శశిరేఖ, స్వర్ణలత ఆధ్వర్యంలో పేషెంట్ కృష్ణకు మత్తుమందు స్పెషలిస్ట్ కోటిరెడ్డి శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసినట్లు వెల్లడించారు. చింతూరు డివిజన్‌లో ప్రజలకు స్పెషలిస్ట్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విధాల సహకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఎ పిఒకు కృతజ్ఞతలు తెలిపారు.










