Mar 15,2023 23:47

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి సీతారామయ్య

సిపిఎం నాయకులు సీతారామయ్య
ప్రజాశక్తి-కూనవరం

కూనవరం సిహెచ్‌సిలో ప్రస్తుతం ఉన్న వైద్యులను యథావిధిగా కొనసాగించాలని సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కూనవరం సిహెచ్‌సిలో ఖర్చు లేకుండా స్పెషలిస్టు వైద్యులు వైద్యం చేస్తున్నారని తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్న వీరిలో కొంత మందిని అధికారులు డిప్యూటేషన్‌పై పంపడం సరికాదని పేర్కొన్నారు. దీని వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వైద్యం అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడు మండలాల ప్రజలకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉందని, ఇలాంటి ఆసుపత్రిలో వైద్యులను డిప్యూటేషన్‌పై పంపించేసి ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేయడం దారుణమన్నారు. తక్షణమే సిహెచ్‌సిలోని అన్ని విభాగాలకు వైద్యులను తిరిగి నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, నాయకులు బొగ్గా రామారావు, బొగ్గా సుబ్బయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, బాబు, బొర్రయ్య, పాయం రాధ తదితరులు పాల్గొన్నారు.