Feb 21,2023 22:21

భీమడోలు మండలంలో సుడిగాలి పర్యటన
ప్రజాశక్తి - భీమడోలు

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా మరింత మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. దీనిలో భాగంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, కురెళ్లగూడెం, సూరప్పగూడెం రైతుభరోసా కేంద్రాలను సందర్శించారు. తొలుత భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న కలెక్టర్‌ వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, చికిత్స విధానం, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఇతర అవసరాల కోసం ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన అభివృద్ధి కమిటీ నిధులు వినియోగించాలని అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ చింతా రాము, పర్యవేక్షకులు డాక్టర్‌ శ్వేతకు సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మాణానికి ప్రతిపాదించిన ట్రామా కేర్‌ సెంటర్‌పై ఆరా తీశారు. అయితే ఇప్పటికే రూ.2.53 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఔట్‌ పేషెంట్‌ బ్లాక్‌లో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుపై బాధ్యులతో మాట్లాడారు. ఆరోగ్య కేంద్రం సరిహద్దులను ఖరారు చేసి, మెరక చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆరోగ్య కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రం కొనసాగుతున్న ప్రాంతం ఎగువున గల చెరువు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి చెరువును పునరుద్ధరించాలని సూచించారు. రెండు జాతీయ రహదారుల మధ్య ఉన్న భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ఉత్తమ వైద్య సేవలందించేందుకు అవసరాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం కలెక్టర్‌ కురెళ్లగూడెం, సూరప్పగూడెం గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రాలను సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, ప్రయోజనాలు, రైతులు కోరుతున్న ఇతర సౌకర్యాలపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రైతుభరోసా కేంద్రాల ద్వారా తమకు అవసరమైన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ చేస్తుందని తెలిపారు. ఎరువులతోపాటు పురుగుమందులు అందుబాటులో ఉంచాలని వారు కోరారు. అనంతరం సూరప్పగూడెం రైతుభరోసా కేంద్రం పరిధిలోని క్లస్టర్‌ హైరింగ్‌ సెంటర్‌కు వ్యవసాయ శాఖ మంజూరు చేసిన వరి కోత యంత్రం ద్వారా అందుతున్న సేవలపై రైతులను అడిగారు. ఈ సందర్భంగా రైతులు యంత్రం ద్వారా వరి కోతకు ఎకరాకు రూ.2,400 చెల్లిస్తున్నామని వివరించారు. భీమడోలు వ్యవసాయాధికారి ఉషారాణి మాట్లాడుతూ మండల పరిధిలో ఇ-పంట నమోదు నూరుశాతం, ఇకెవైసి నమోదు 85 శాతం పూర్తయ్యాయన్నారు. రెండు రోజుల్లో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ భీమడోలు సహాయ సంచాలకులు పి.ఉషారాజకుమారి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.