Aug 03,2023 21:53

సిహెచ్‌డబ్ల్యుఒలనుద్దేశించి మాట్లాడుతున్న శ్రామికమహిళా సంఘం నాయకులు ఇందిర

బెలగాం: జిల్లాలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు నాలుగు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని స్థానిక ఐటిడిఎ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిర మాట్లాడుతూ బకాయి వేతనాలు ఇవ్వాలని, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కే బందావతి, అరుణ, అనిత, మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆరోగ్య సేవలందిస్తూ విధులు నిర్వహిస్తున్నామని, తమకు ప్రతినెలా వేతనాలు ఇవ్వాలని, ఆశాలుగా గుర్తించాలి, గుర్తింపు కార్డులు, యూనిఫాం ఇవ్వాలని, ఉపాధి భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, కార్యదర్శి ఎన్‌వై నాయుడు, నాయకులు బి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.