Jun 11,2023 23:44

డాక్టర్‌ మళ్ల భాస్కరరావును సత్కరిస్తున్న గౌరీ గ్రంథాలయ కమిటీ సభ్యులు

ప్రజాశక్తి-అనకాపల్లి
శరీరంలోని సిగలింగ్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్ధలను నాడీ వ్యవస్థ నియంత్రిస్తుందని అంతర్జాతీయ న్యూరోసర్జరీ వైద్య నిపుణులు, కేంద్ర ప్రభుత్వ నిమ్‌హేన్స్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సస్‌, బెంగుళూరు) ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగం పూర్వపు ప్రధాన అధిపతి డాక్టర్‌ మళ్ల భాస్కరరావు తెలిపారు. గౌరీ గ్రంధాలయంలో 'నరాల వ్యాధుల నివారణ-చికిత్స' అన్న అంశంపై శనివారం రాత్రి జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు మెదడుకు సంచలనాన్ని కలిగించే నరాలను ప్రభావితం చేస్తాయన్నారు. మధుమేహం వల్ల 30 శాతం నరాల నొప్పులు వస్తాయని తెలిపారు. అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ అవసరమని, నెట్‌వర్క్‌లో ఎక్కువ నరాలకు నష్టం జరిగితే సంబంధిత పనితీరు దెబ్బతింటుందని స్పష్టం చేశారు. డయాబెటిక్‌ న్యూరోపతి, పోస్ట్‌-హెర్పెటిక్‌ న్యూరల్జియా, ఉల్నార్‌ నరాల పక్షవాతం, కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌, పెరోనియల్‌ నరాల పక్షవాతం, బెల్‌ పక్షవాతం వ్యాధుల నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 100కి పైగా వివిధ నరాలవ్యాధులు నిర్ధారణ చేయబడ్డాయని, కాలక్రమంలో మరిన్ని బయటపడవచ్చని తెలిపారు. రోగ నిర్ధారణకు నరాల బయాప్సీ చేయవచ్చన్నారు. నిరంతరం ఏదో ఒక పనిచేయాలని, లేకుంటే మెదడులోని కణాలు చచ్చిపోయి మతిమరుపు వస్తుందని హెచ్చరించారు. మెదడుకు రక్తం సరఫరా సక్రమంగా జరగకపోతే పిట్స్‌ వ్యాధి, పక్షవాతం సోకుతుందని చెప్పారు. మెదడు నిరంతరం చురుగ్గా పని చేయాలంటే రోజూ ఆరగంట నడవడం, సంగీతం వినడం, యోగా, ధ్యానం చేయడం, ఆహార నియమాలు పాటించడం చేయాలని సూచించారు. మానవ శరీరంలో అన్ని భాగాలు మార్చవచ్చుగాని మెదడును మార్చడం వీలుకాదని, అందువల్ల మెదడు ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ సందర్భంగా డాక్టర్‌ మళ్ల భాస్కరరావును గ్రంథాలయం, పలు స్వచ్ఛంద సంస్ధలు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం న్యూరాలజీ రోగులను ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు పరీక్షించారు. గౌరీ గ్రంథాలయం కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఎంవి.బెనర్జీ, బివిఎం.ప్రసాద్‌, కె.అచ్చన్ననాయుడు, గౌరీ గ్రంథాలయ అధ్యక్షుడు డి.నూకఅప్పారావు, ప్రొగ్రాం కన్వీనర్‌ మళ్ల బాపునాయుడు, కోశాధికారి బి.కృష్ణఅప్పారావు, సభ్యులు కాండ్రేగుల సత్యనారాయణ (ఎస్‌ఎఫ్‌ఐ), బొడ్డేడ జగ్గఅప్పారావు, కాండ్రేగుల పరమేశ్‌ జిల్లా నలుమూలల నుంచి వైద్యులు, ప్రజలు పాల్గొన్నారు.