Apr 22,2021 07:43

పత్రికా స్వేచ్ఛకు పట్టుకొమ్మ లాంటి మన దేశంలో నేడు జర్నలిస్టులు, జర్నలిజం ఎదుర్కుంటున్న పరిస్థితులు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. బ్రిటిష్‌ పాలనపై సాగించిన స్వాతంత్య్ర సంగ్రామంలో పత్రికలది, పాత్రికేయులది కీలకపాత్ర! స్వేచ్ఛా సమరాన్ని ముందుకురికించిన అప్పటి జాతీయ నాయకులు ఎందరో అక్షర సైనికులుగానూ ప్రముఖ పాత్ర పోషించారు. ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా గోడ పత్రికలను సైతం ఆవిష్కరించి సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేసిన ఘనత మనది! పత్రికలకు, పత్రికాస్వేచ్ఛకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే మహత్మా గాంధీ 'ఏ దేశమూ వదులుకోలేని విలువైన హక్కు' గా అభివర్ణించారు. ఆయన స్వయంగా పత్రికలను నిర్వహించిన విషయమూ తెలిసిందే. స్వతంత్ర పోరులో ఏ మాత్రం పాత్ర లేని సంఘీయుల ఏలుబడిలో పత్రికా స్వేచ్ఛ నానాటికి కొడిగడుతోంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మతోన్మాదం, మూఢనమ్మకాలు, వివక్ష తదితర అంశాలపై అక్షర శరసంధానం చేసే పాత్రికేయులపై మోడీ సర్కారు, ఆయన పార్టీ, ఆ పార్టీని నడిపించే పరివార శక్తులు దాడులు చేస్తున్నాయన్న ఆందోళన ఈనాటిది కాదు. మేథావులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్య వాదులు కొన్నేళ్ళుగా ఈ విషయాన్నే చెబుతున్నారు. ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ప్రతికా స్వేచ్ఛను కాపాడుకోవాలని నినదిస్తూనే ఉన్నారు. ఇప్పుడే అదే విషయాన్ని 'రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌' నివేదిక మరింత స్పష్టం చేసింది. 180 దేశాల వివరాలను పరిశీలించి రూపొందించిన నివేదికలో మన దేశానికి 142వ స్థానం లభించడం పరిస్థితి తీవ్రతను ప్రస్ఫుటం చేస్తుంది. మన తరువాత మరో 38 దేశాలు మాత్రమే మిగిలాయి. ఈ జాబితాలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు మనకన్నా వెనుక ఉండగా, మెరుగైన స్థితిలో శ్రీలంక, నేపాల్‌లు ఉన్నాయి.

నిప్పు లాంటి నిజాలను ప్రజల ముందుంచే పాత్రికేయులపై దేశద్రోహులన్న ముద్ర వేయడం, తమ పరివారం లోని శక్తులచేత వారిని వెంటాడి వేధించడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు బనాయించడం, అరెస్ట్‌లు చేయడం, గోడి మీడియాతో వారిపై తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో ప్రచారం చేయడం వీటన్నిటికి లంగని వారిని భౌతికంగా నిర్మూలించడం! కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ తంతునే తాజా నివేదికలో పేర్కొన్న 'రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌' సంస్థ హిందూ జాతీయవాద ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా ఉండాలని మోడీ సర్కారు ఒత్తిడి తెస్తోందని వివరించింది. కరోనా సమయాన్ని కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించని పాత్రికేయ సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు వినియోగించిందని పేర్కొనడం సిగ్గుచేటు! అంతర్జాతీయ యవనికపై పరువుపోయిన తరువాతైనా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని భావించడం అత్యాశే! కేంద్ర ప్రభుత్వ పెద్దలెవ్వరూ దీనిపై పెదవి విప్పకపోవడం గమనార్హం.

నిష్పాక్షిక మీడియాను క్రూరంగా అణచివేసే చర్యలకు ఒకవైపు ప్రభుత్వం దిగుతుండగా, మరోవైపు పాలకవర్గ ప్రయోజనాలకు పెద్ద పీట వేసే ఫేస్‌బుక్‌ ఈ ఒరవడినే అనుసరిస్తోంది. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఏ చిన్న సమాచారాన్ని పోస్టు చేసినా అనుమతించడం లేదు. తాజాగా ట్విటర్‌ కూడా ఆ బాటలో పయనం మొదలు పెట్టడం దారుణం.

గత ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రైతు కార్మిక సంఘాల నేతలు పాల్గన్న ప్రదర్శన, శంఖారావం బహిరంగ సభల పట్ల ట్విట్టర్‌ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది. కిసాన్‌ 4 వైజాగ్‌ స్టీల్‌, హ్యాష్‌ ట్యాగ్‌తో పలువురు నెటిజన్లు చేసిన ట్వీట్లను పలువురు రీ ట్వీట్‌ చేయడంతో ఉక్కు ఉద్యమ వార్తలు పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ కావడం ప్రారంభించాయి. దీంతో రంగంలోకి దిగిన ట్విట్టర్‌ కొన్ని ట్వీట్లను లాక్‌ చేసింది. రీట్వీట్లను, కామెంట్లను నిలిపివేసింది. కొందరి ఖాతాలను, హ్యాష్‌ట్యాగ్‌లను బ్లాక్‌ చేసింది. వీడియోలు, ఫోటోలు అప్‌లోడ్‌ కాకుండా అడ్డుకుంది. ఇటువంటి నిరంకుశ చర్యలకు పాల్పడమంటూ గతంలో స్వయంగా చేసిన ప్రకటనను రూపొందించుకున్న నిబంధనలను మోడీ సర్కారు సేవలో ట్విట్టర్‌ తుంగలో తొక్కింది. భవిష్యత్తులోనూ ఇటువంటి చర్యలు పునరావృతం కావని చెప్పలేం! భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించుకోవడం ద్వారానే ఈ తరహా నిరంకుశ చర్యలను ప్రతిఘటించడంతో పాటు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం. ఈ లక్ష్య సాధన కోసం విస్తృత పోరాటాలకు పాత్రికేయులతో పాటు, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా కదలాలి.