Nov 09,2023 00:29
తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు, రైతులు

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: పాలకుల నిర్లక్ష్య వైఖరి మండలానికి శాపంగా మారిందని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు విమర్శించారు. సిఎస్‌ పురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా లేని కారణంగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న మండలంలోని అనేక మంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసపోగా మిగిలిన కొద్దిమంది రైతులు 20 నుంచి 25 శాతం మాత్రమే పంటలు సాగు చేశారని అన్నారు. వీరిలో పలువురు రైతులు దుక్కులు దున్ని వర్షాభావం కారణంగా పంట సాగు చేసే అవకాశం లేక వదిలేశారని, వర్షాలు పడతాయనే ఆశతో మరి కొద్దిమంది రైతులు కంది, మినుము, మిరప, సజ్జ పంటలు సాగు చేశారని అన్నారు. అయితే వర్షాలు లేని కారణంగా కంది, మినుము, మిరప, పంటలు పూర్తిగా ఎండిపోగా సజ్జ పంట దిగుబడి పూర్తిగా పడిపోయిందన్నారు. కరువు పరిస్థితులను అంచనా వేయడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో మండల ప్రజానీకానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రస్తుతం వర్షాలు లేక పంటలు ఎండిపోయి నష్టపోయారన్నారు. అన్నదాతలు పంటలు సాగు చేయడం ఆపివేస్తే ప్రజలకు తినడానికి ఏమీ దొరకదని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేశారని, పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్‌లకు అప్పగించారని, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టినందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో బిజెపిని భూస్థాపితం చేయకపోతే దేశంలో ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. సిఎస్‌ పురంను కరువు మండలంగా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని, విత్తనాలు, పురుగు మందులు ఉచితంగా అందజేయాలని, పశుపోషకులకు ఉచితంగా ప్రశుగ్రాసం పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వినతి పత్రాన్ని తహశీల్దారు నాగుల్‌ మీరాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతిరెడ్డి, బి జేసురత్నం, ఎం రత్నారెడ్డి, జై మోహన్‌, తిరుమలయ్య, తిరుపతమ్మ, నాగమ్మ, పలువురు రైతులు పాల్గొన్నారు.