
సిఎంతో ఎంజిఆర్ స్మృతివనం ప్రారంభం
ప్రజాశక్తి-ఉదయగిరి : మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో రూ.7కోట్ల అంచనాతో ఏర్పాటు చేయనున్న ఎంజిఆర్ స్మృతివనాన్ని ఆయన రెండో వర్థంతి ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్మృతివనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.ఏడు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. స్మృతివనం పూర్తయితే మంచి సందర్శన ప్రదేశంగా మారుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రేమతో వ్యవసాయ కళాశాలకు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెట్టారని రాబోయే రోజుల్లో వ్యవసాయ కళాశాల వ్యవసాయ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. 2024లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని 25 మంది ఎంపిలను సాధించుకుంటామని కేంద్రంలో హంగ్ పార్లమెంటు ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 25మంది ఎంపిలను సాధించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భంలో ఏ హామీలు అయితే కేంద్రం ఇచ్చి ఉందో ఆ హామీలు ఎవరు నిర్వర్తిస్తారని ముందుకు వస్తే వారికే మద్దతు ఉంటామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యంతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావస్తుందని తెలిపారు. మరో రెండు వందల మీటర్లు పని మాత్రమే ఉందని ఆ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గంలో 70వేల ఎకరాల భూమి సాగుబడిలోకి వస్తుందన్నారు. పోలవరం పూర్తయితే ఆ నీరు నెల్లూరు జిల్లా తడ వరకు తెచ్చుకోగలమన్నారు. కష్టపడే రైతాంగం ఉంది సాగుకి యోగ్యమైన భూములు ఉన్నాయని నీటి లభ్యత ఒక్కటే లేదని ఆ కొరత కూడా త్వరలోనే తీరిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్మృతి వనం ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని ఫిబ్రవరి 21 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని ఇంజనీర్లను కోరారు. ఆయనవెంట జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్, మండల కన్వీనర్ ఓబుల్‌రెడ్డి, సర్పంచ్ కల్లూరి వెంకటేశ్వర్లు రెడ్డి, అక్కి భాస్కర్ రెడ్డి, వెంగళరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.