
* 160 స్థానాల్లో గెలుపు ఖాయం
* టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి - పలాస: రాష్ట్రంలో కరువుఛాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వర్షాభావం, ప్రభుత్వ వైఫల్యంతో ప్రాజెక్టుల సాగునీరు అందక పంటలు ఎండిపోతే కంటితుడుపు చర్యగా ఏడు జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని ధ్వజమెత్తారు. కాశీబుగ్గలోని ఒక కళ్యాణ మండపంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యాన వైసిసి అసమ్మతి నాయకులు, పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు దువ్వాడ హేంబాబు చౌదరితో పాటు 25 మంది వైసిపి నాయకులు, 150 మంది కార్యకర్తలు టిడిపిలో గురువారం చేరారు. అచ్చెన్నాయుడు వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి పంట పూర్తిగా పాడైనా జిల్లాలోని ఇద్దరు మంత్రులు, స్పీకర్ కరువు జిల్లాగా ప్రకటించుకోలేకపోయారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకొస్తే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటిస్తామని హామీనిచ్చారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్‌కు జీవితాంతం చిప్ప కూడు తప్పదన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని చెప్తున్న వైసిపి నాయకులు ఒక్క రూపాయి అయినా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. వైసిపి పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో టిడిపి గెలుపు ఖాయమన్నారు. పాల వెల్లువ పథకంలో రూ.రెండు వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయని, ఇదే నిజమైతే పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును జైలుకు పంపడం ఖాయమన్నారు. పలాసలో భూ కబ్జాలు చేయడం తప్ప ఆయన ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా వంశధార శివారు భూములకు సాగునీరు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. పలాసలో వైసిపి నాయకులు టిడిపిలో చేరేందుకు టచ్‌లో ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి సీదిరి అప్పలరాజు సీటు ఖాళీ కావడం తథ్యమన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు దువ్వాడ హేంబాబు చౌదరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గౌతు శిరీషను గెలిపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్, మాజీ మంత్రి గౌతు శివాజీ, ఎమ్మెల్యే బెందాళం అశోక్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, టిడిపి జిల్లా మాజీ అధ్యక్షులు చౌదరి బాబ్జీ, నియోజకవర్గంలోని అన్ని మండలాల టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.