Jun 24,2023 01:56
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి-అద్దంకి/మద్దిపాడు: రైతులు, పేదల పట్ల సిఎం జగన్మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' బస్సు యాత్ర కార్యక్రమం గత నాలుగు రోజులుగా బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలలో జరిగింది. 5వ రోజు మార్టూరులో బయలుదేరి హైవే మీదుగా అద్దంకి నియోజకవర్గంలోని తిమ్మనపాలెం, ఆ తరువాత చేరుకుంది. అక్కడ టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. నాగులుప్పలపాడు రోడ్డులోని మహిళలు, వ్యాపారులు, పాదచారులకు భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రం అందించి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా చేపట్టే అంశాలను నేతలు వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో శంఖుస్థాపన చేసిన సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం గ్రోత్‌ సెంటర్‌, మరియు తిమ్మనపాలెం నుంచి నాగులుప్పలపాడు వరకు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డుపై సెల్ఫీ దిగారు, టీ స్టాల్‌ వద్ద టీ తాగుతూ స్థానికులతో మాట్లాడారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి మద్దిపాడు వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ర్యాలీగా గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్దకు వెళ్లి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మీడియాతో మాట్లాడుతూ.. గుండ్లకమ్మ జలాశయ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 15 నెలలు కావస్తున్నా నేటికీ గేట్లు అమర్చడం ఈ వైసిపి ప్రభుత్వానికి చేతకాలేదని విమర్శించారు. గేట్లు పెట్టకపోవడం వెనుక పెద్ద స్థాయిలో కుట్ర కోణం దాగి ఉందనే అనుమానం కలుగుతోందని అన్నారు. రైతులు, పేదల పట్ల ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ఒకప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోటీపడే ఆంధ్రప్రదేశ్‌ను నేడు బీహార్‌ కంటే అథమ స్థాయికి తీసుకువచ్చారని, ఇది ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పరిపాలన వైఫల్యమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని, ముఖ్యంగా ప్రాజెక్టు పరిధిలోని రైతాంగానికి, మత్స్యకారులకు పూర్వవైభవం తీసుకొస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, బాపట్ల పార్లమెంటు మాజీ సభ్యుడు శ్రీరాం మాల్యాద్రి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజరు కుమార్‌, బాపట్ల టిడిపి ఇన్‌ఛార్జ్‌ వేగశన నరేంద్రవర్మ, చీరాల ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.