ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి
అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం సెజ్‌లోని ఎటిసి టైర్ల కంపెనీ తొలి దశ యూనిట్ ఉత్పత్తి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. సిఎం రాక నేపథ్యంలో ప్రజలు గంపెడాశతో ఉన్నారు. జిల్లాలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వ జిఒ ఈ నాటికీ అమలుకావడంలేదు. పారిశ్రామిక ప్రగతికి భూములిచ్చి నిర్వాసితులైన కుటుంబాలకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించడం లేదు. స్థానికులకు విద్యార్హతలున్నా ఇతర ప్రాంతాల కార్మికులతో తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్న పరిస్థితులు అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మా, ఇతర పరిశ్రమల్లో వున్నాయి. కొన్ని పరిశ్రమల్లో క్లీనింగ్ పనులు, అటెండర్ పనులు కల్పిస్తున్నారు తప్ప విద్యార్హతలకు తగిన ఉపాధి కల్పించడంలేదు. స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించే పర్యవేక్షణ జిల్లా స్థాయిలో లేదు. ప్రభుత్వం స్థానికుల ఉపాధిపై శ్రద్ధ తీసుకోకపోవడంతో ఆ తరహా సమీక్ష జిల్లా యంత్రాంగం చేయడంలేదు. ఫార్మా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, సేఫ్టీ ఆడిట్ నిర్వహణ సరిగా లేకపోవడం, పరిశ్రమల తనిఖీ అధికారుల అధికారాలు కుదించి, తనిఖీలు పరిమితం చేయడంతో భద్రతా లోపాలను సరిచేసే వ్యవస్థ పటిష్టంగా లేకుండా పోయింది. కార్మికులకు పనిచేసే చోట భద్రత వుండడంలేదు. కనీస వేతనాలు అమలుకావడంలేదు. పర్యావరణ సమస్యలు తీవ్రమవుతున్నా కంపెనీలు పట్టించుకోవడంలేదు. అచ్యుతాపురం సెజ్ బ్రాండిక్స్ అపెరల్ సిటీలోని సీడ్స్ వస్త్ర పరిశ్రమలో రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు విష వాయువులు లీకవడంతో మహిళా కార్మికులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. విషవాయువులు లీకవడానికి కారణాలు వెల్లడించి లోపాలను గుర్తించి సరిచేసే కనీస ప్రయత్నం చేయలేదు. ప్రమాదాలపై కమిటీలు నివేదిక సమర్పించినా ఆ నివేదికలు బయటపెట్టలేదు. ఈ చర్యలు కార్మికుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, భయాన్ని పెంచుతున్నాయి. బ్రాండిక్స్ కంపెనీ, అపెరల్ సిటీలోని కంపెనీల్లో కార్మికులకు కనీస వేతనం పది వేలు అమలుకావడంలేదు. తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరించకపోగా క్రషింగ్ నిలిపివేయడంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిశ్రమలను ఆధునికీకరించాలని రైతులు కోరుతున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఈ ఏడాది ఏప్రిల్ 28న తాడి తరలింపుపై వారం, పది రోజుల్లో రూ.56 కోట్లు విడుదలచేసి తాడికి న్యాయం చేస్తామని సిఎం ప్రకటించడంతో కొత్త ఆశలు కలిగాయి. ఫార్మా కంపెనీల దుర్వాసన, వ్యాధుల బారి నుంచి బయటపడతామని అంతా ఆశ పడ్డారు. ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోక తాడి ప్రజలు బాధపడుతున్నారు.
సిఎం పర్యటన ఇలా..
అచ్యుతాపురం సెజ్‌లోని ఎటిసి టైర్స్ ఎపి ప్రయివేట్ లిమిటెడ్ యూనిట్ ఉత్పత్తిని మంగళవారం సిఎం జగన్ ప్రారంభించనున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి ఉదయం 10.30 గంటలకు చేరుకొని, తిరిగి మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రయాణమవుతారు. ఈ మధ్య కాలంలో జపాన్‌కు చెందిన ఎకహోమా గ్రూపునకు చెందిన ఎటిసి టైర్ల పరిశ్రమ ప్రారంభంతో పాటు సెజ్‌లోని ఎటిసి రెండో దశ యూనిట్, మెస్సర్స్ పిడిటైల్ పరిశ్రమ, మేఘ ఫ్రూట్ ప్రాసెసింగ్, మెస్సర్స్ ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్, మెస్సర్స్ ఆప్టిమస్ డ్రగ్స్, విన్‌విన్ స్పెషాల్టీ ఇన్సులేటర్, సైనాప్టిక్స్ ల్యాబ్, స్టైరాక్స్ లైఫ్‌సైన్సెస్, ఇషా రిసోర్సెస్ కంపెనీలకు భూమిపూజ చేయనున్నారు. రెండు దశల్లో రూ.2,200 కోట్లతో ఎటిసి టైర్ల కంపెనీ ఏర్పాటుచేయనున్నారు. మంగళవారం రూ.1500 కోట్లతో నిర్మించిన తొలి యూనిట్ ఉత్తత్తిని సిఎం ప్రారంభించనున్నారు.
సుజల స్రవంతి నిర్వాసితులకు
2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వాలి : సిపిఎం
బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూ సేకరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. పాత ఎలైన్‌మెంట్ ప్రకారం కాలువ నిర్మాణ పనులు చేపట్టి, ఎక్కువ మంది రైతుల భూములు పోకుండా చూడాలని సిఎంకు విజ్ఞప్తి చేసింది. హెటిరో డ్రగ్స్ పైపులైను పనులకు అనుమతులివ్వొద్దని 258 రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆ పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాండవ, ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు జీతాలు చెల్లించి, సుగర్ ఫ్యాక్టరీలను ఆధునికీకరించాలని కోరారు. పూడిమడక జట్టీ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలన్నారు.










