ప్రజాశక్తి-చెరుకుపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మత్స్యకార భరోసా నిధులను విడుదల చేసేందుకు మే 16వ తేదీన నిజాంపట్నం పర్యటిస్తున్న నేపథ్యంలో రేపల్లె నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుకు పలు నియోజకవర్గాలలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేపల్లె నియోజకవర్గంలో పర్యటించడం సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రత్నప్రసాద్, పార్టీ మండల కన్వీనర్ ఏడుకొండలరెడ్డి, మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు, జడ్పిటిసి సభ్యులు మర్రివాడ వెంకటపావని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










