ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి/ తుళ్లూరు : తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా భారీగా జనసమీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని రైతుల నుంచి నిరసనలేమీ వ్యక్తం కాకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు రేంజి నుంచి వివిధ జిల్లాల పోలీసులు, అధికారులతో పాటు విజయవాడకు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారులను రప్పిస్తున్నారు. గుంటూరు రేంజి ఐజి పాల్‌రాజ్ పర్యవేక్షణలో పల్నాడు, గుంటూరు ఎస్‌పిలతో పాటు విజయవాడ నుంచి డిసిపిలు రవీంద్రబాబు, విశాల్ గున్నీ తదితరులను రప్పించారు. దాదాపు 4వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.
జనసమీకరణకు గుంటూరు జిల్లా నుంచి 600 ప్రైవేటు బస్సులు, 300 ఆర్‌టిసి బస్సులను వినియోగించనున్నారు. ఎన్‌టిఆర్ జిల్లా నుంచి ప్రైవేటు, ఆర్‌టిసి బస్సులు కలిపి మరో 600 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను భారీగా సమకూర్చడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నల్గొండ, ఎన్‌టిఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో వాహనాల రాకపోకలను ఇతర మార్గాల వైపు మళ్లీస్తున్నారు. సిఎం సభలో నిరసనలు వ్యక్తం కాకుండా పోలీసు అధికారులు, నిఘా విభాగం గ్రామాల్లో ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాకు సన్నాహలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కరకట్ట గుండా కొత్తగా నిర్మించిన రోడ్డు మీదుగా సభాస్థలికి చేరుకుంటారు. వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన సుమారు 20 ఎకరాల్లో సభ ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఆర్ అండ్ బి, పోలీసు తదితర శాఖలు సభా ఏర్పాట్లలో నిమగమయ్యారు. సభా వేదికకు కుడి వైపు విఐపిలకు ప్రత్యేక గ్యాలరీలను కేటాయించారు. మొత్తం 46 గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సభకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా సుమారు లక్ష వాటర్ పాకెట్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సభతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య, పంచాయతీ కార్మికుల సేవలను వినియోగించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సభకు వచ్చే మార్గాల్లో పిచ్చి చెట్లను తొలగించారు. సభకు దారితీసే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. కృష్ణా కరకట్ట రోడ్డు మార్గంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
రాజధాని రైతుల ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. సభకు లక్ష మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. సభకు రావాలని డ్వాక్రా మహిళలను యానిమేటర్లు ఫోన్ చేసి చెబుతున్నారు. టిడ్కో గృహ లబ్ధిదారులు సభకు రావాలని గ్రామాల్లో మైక్ ప్రచారం చేశారు. ఇదిలా ఉండగా రాజధాని రైతులు దీక్షా శిబిరాలలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నల్ల బెలూన్లు ఎగురవేసి నిర్ణయించినట్లు ప్రచారమైంది. శిబిరాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించే అవకాశం భావిస్తున్నారు.
మంత్రుల పరిశీలన..
సభా ఏర్పాట్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, విడదల రజనీ, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు తలసిల రఘురామ్, ఎల్.అప్పిరెడ్డి, ఎంపి నందిగం సురేష్, నాయకులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మందపాటి శేషగిరిరావు, కత్తెర సురేష్ కుమార్, కలెక్టరు వేణుగోపాలరెడ్డి, సిఆర్‌డిఎ కమిషనర్ వివేక్ యాదవ్, పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు.










