Dec 31,2022 00:12

భారీగా తరలి వచ్చిన జనం

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: నర్సీపట్నంలో జరిగిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బహిరంగ సభకు ప్రజలను భారీగా తరలించారు. ఉదయం 6 గంటల నుండి గ్రామాలకు వాహనాలు చేరుకోగా ప్రజలను సభకు తరలించారు. డ్వాక్రా మహిళలను గ్రామంలో ఉండే వెలుగు సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు, పెన్షన్‌లను ఎరగా చూపిస్తూ ప్రజలను తరలించారు. సభా ప్రాంగణం చిన్నది కావడంతో దూరంగానే బస్సులు నిలిపివేయడంతో ఒక వంతు ప్రజలు ఇబ్బందులు పడుతూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేకువజామున గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ప్రజలను తరలించడంతో వారికి అందించిన ఆహార పొట్లాలు పాడవడంతో పాడవేశారు.
సిఎంకు వినతులు సమర్పణ
నర్సీపట్నంటౌన్‌:శుక్రవారం ఉదయం 10 గంటల 55 నిమిషములకు బలిఘట్టం హెలిపాడ్‌ వద్ద దిగిన సీఎం ప్రజలకు అభివాదం చేస్తూ మూడు కిలోమీటర్లు బహిరంగ సభ వరకు కాన్వారు సాగింది. సీఎం కాన్వారుని మధ్య మధ్యలో ప్రజలు వినతలు ఇచ్చేందుకు ప్రజలు రావడంతో కొంత సేపు నిలిపివేశారు. సీఎం రెండుసార్లు కాన్వారు దిగి అభ్యర్థనలు స్వీకరించారు. 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న గోపాలమిత్రులను ఆదుకోండి సార్‌ అంటూ బ్యానర్‌తో జిల్లా గోపాలమిత్రులు సీఎంకు బ్యానర్‌ చూపించడంతో సానుకూలంగా స్పందిస్తూ వినతిపత్రాన్ని అధికారులకు ఇవ్వమని నవ్వుతూ అభివాదం చేశారు. దీంతో నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ భవాని శంకర్‌ వినతులను స్వీకరించారు. కొందరు మహిళలు వినతులు ఇచ్చారు.మూడు కిలోమీటర్ల వరకు సాంస్కతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
పోలీసులకు తప్పని అవస్థలు
నర్సీపట్నంటౌన్‌: సీఎం పర్యటన నేపథ్యంలో నర్సీపట్నంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం 28న జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో రెండు రోజులుగా వాయిదా పడింది. 27న సాయంత్రమే నర్సీపట్నంకు పోలీసులు చేరుకున్నారు. బందోబస్తులో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున సుమారు 1200 మంది పోలీసులను మోహరించారు. వీరికి పెద్ద బొడ్డేపల్లి ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్లో వసతి ఏర్పాటు చేశారు. స్థానిక శివాలయం దగ్గరలో ఒక కల్యాణ మండపంలో భోజనాలు ఏర్పాటు చేశారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌ నుండి భోజనాలు ఏర్పాటు చేసే స్థలానికి సుమారు ఒక కిలోమీటర్‌ దూరం నడిచి రావాల్సి ఉంది. దీంతో పోలీసులు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఇంత ప్రాయసపడి భోజనాలకు చేరుకున్నప్పటికీ 100 మందికి సరిపడే స్థలంలో సుమారు 1200 మంది పోలీసులకు భోజనాలు ఏర్పాటు చేయడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందులోను ఇప్పటికే పెరుగుతున్న కరోనాపై ప్రచారం జరగడంతో భయాందోళన చెందారు. పోలీసులకు ఏర్పాటు చేసిన వసతి, భోజనశాలకు సిఎం సభాస్థలి చాలా దూరం కావడంతో నానా ఇబ్బందులకు గురయ్యారు. మరుగుదొడ్లు లేక మహిళా పోలీసులు ఇబ్బంది పడ్డారు.
ఇంత భారీ భద్రత నడుమ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నా కనీస వసతులు, భోజనం ఏర్పాటు చేయడంలోనూ విఫలం చెందారని పోలీసులు పాత్రికేయుల వద్ద వాపోయారు.
కోటవురట్ల:నర్సీపట్నం మండలం జోగినాథపాలెం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సభకు పెద్ద సంఖ్యలో మండలం నుంచి కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. మండలం నుంచి సుమారు 85 బస్సులు ఏర్పాటు చేశారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేశారు.