
ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో డ్రగ్స్ కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైను ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని, తమ ఆవేదన, గోడును సీఎం సార్ వినాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. కంపెనీ కొత్తగా వేస్తున్న పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన శాంతియుత మహా ధర్నా 677వ రోజుకు చేరింది. మత్స్యకారులు చేస్తున్న ధర్నాలో ఆదివారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు మద్దతును తెలియజేశారు. పైప్ లైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు 677వ రోజుల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి నేటి వరకు మార్గం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పర్యటనకు సోమవారం సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్ లైన్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెటిరో డ్రగ్స్ మందుల కంపెనీ ఏర్పాటు చేసిన దగ్గర నుండి కంపెనీ నుండి వెలువడే వ్యర్థ రసాయన జలాలు సముద్రంలోకి వదలడంతో చేపలు వృద్ధి లేకపోవడం తో తామంతా ఉపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ కాలుష్యం కారణంగా కేన్సర్, ఊపిరితిత్తులకు చెందిన వ్యాధులు బారిన పడి అనేక మంది మత్స్యకారులు మరణించారని, అనేక మంది వైద్యం కోసం లక్షల రూపాయలు అప్పు లు చేసి ఆసుపత్రి చుట్టూ తిరగవలసి వస్తుందన్నారు. మరో కొత్త పైపులైను వేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.కొత్త పైపులైన్ ఏర్పాటు తమ ఉనికికే ప్రమాదమని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు చేపలు సోమేష్, గోసల సోమేశ్వరరావు, మొలపల్లి బైరాగి రాజు, బొంది నూకరాజు, కొత్వాల్ కాశి, బొంది సతీష్, ముడి సోమేష్ తదితరులు పాల్గొన్నారు.