Mar 24,2023 20:57

రెగ్యులేటర్ల నిర్మాణం ఏమైందో
ముందుకు సాగని భూముల రీసర్వే
ధ్వంసం చేసిన జిరాయితీ భూముల కోసం రైతుల ఎదురుచూపు
కొల్లేరు గ్రామాల్లో తాగునీరు, ఉపాధి సమస్యలతో జనం సతమతం
పోలవరం నిర్వాసితుల పరిహారం సం'గతేంటీ'
నేడు దెందులూరులో సిఎం జగన్‌ పర్యటన
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

సిఎం సారూ.. కొల్లేరుపై గుప్పించిన హామీలు అమలు చేసేదెప్పుడంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. శనివారం కొల్లేరు ప్రాంతమైన దెందులూరు పర్యటనకు సిఎం జగన్‌ రానుండటంతో కొల్లేరు ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలపై సర్వత్రా చర్చ సాగుతోంది. 2022 మే 16న గణపవరంలో సిఎం పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లేరు ప్రజలకు పలు హామీలు గుప్పించారు. దాదాపు ఏడాది అవుతున్నా ఇప్పటికీ అవేమీ అమలుకు నోచుకోని దుస్థితి ఉంది. కొల్లేరులోకి సముద్రం నుంచి ఉప్పునీరు రాకుండా ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడితడక వద్ద, మోళ్లపర్రు గ్రామాల సమీపాన మొత్తం మూడు రెగ్యులేటర్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. అందుకుగాను రూ.412 కోట్లు అంచనాలకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేసినట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు హామీ ఇచ్చారు. దాదాపు ఏడాది గడిచిపోయింది. ఇప్పటి వరకూ రెగ్యులేటర్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన సైతం జరగలేదు. అసలు రెగ్యులేటర్ల నిర్మాణం జరిగేనా అనే అనుమానం నెలకొంది. ప్రకటనలు గొప్పగా ఉంటున్నా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదనే చర్చ జనాల్లో నెలకొంది. అదే సభలో కొల్లేరు భూములకు సంబంధించిన రీసర్వే పనులు గురించి మాట్లాడుతూ కరోనా కారణంగా పనులు ముందుకు సాగలేదని, త్వరలోనే పూర్తి చేస్తామని సిఎంనే స్వయంగా ప్రకటించారు. కొల్లేరులో భూముల రీసర్వే జరిగితే ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో 2006లో ప్రభుత్వం జిరాయితీ భూముల్లోని చెరువులను సైతం బాంబులు పెట్టి ధ్వంసం చేసింది. కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. ధ్వంసం చేసిన జిరాయితీ భూములకు సంబంధించి లెక్కలు తేల్చి అప్పగించాలని కొల్లేరు ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రీసర్వే జరిగితే దాదాపు పది వేల ఎకరాల వరకూ రైతులకు అందే అవకాశం ఉందని వైసిపి ఎంఎల్‌ఎలు సైతం చెబుతున్నారు. రీసర్వే పనులు పూర్తి చేసి జిరాయితీ భూముల లెక్క ఇప్పటికీ తేల్చని పరిస్థితి నెలకొంది. కొల్లేరు పర్యాటక అభివృద్ధికి సంబంధించి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కొల్లేరు ప్రాంత ఎంఎల్‌ఎలతో జిల్లా అధికారులు పర్యాటకాభివృద్ధిపై సమావేశం సైతం నిర్వహించారు. బోటు షికారుతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు లేవు. దీంతో కొల్లేరు ప్రాంత ప్రజలకు సరైన ఉపాధి లేక వలస పక్షుల్లా వివిధ రాష్ట్రాలకు వెళ్లి బతుకులు నెట్టుకొస్తున్నారు. కొల్లేరు గ్రామాల్లో తాగునీటి సమస్యతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్టున్నపాడు, మల్లవరంతోపాటు కైకలూరు మండలంలోని అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొల్లేరు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆగడాలలంకలో రూ.20.61 కోట్లతో రిజర్వాయర్‌ తరహా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కొల్లేరు ప్రజలు కోరుతున్నా పెద్దగా పట్టించుకోని దుస్థితి నెలకొంది.
పోలవరం నిర్వాసితుల సం'గతేంటీ'
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. ఇది కేంద్రం పరిధిలోని ప్రాజెక్టు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమైంది. 41.15 కాంటూరు వరకూ ఉన్న గ్రామాల నిర్వాసితులకు వెంటనే పరిహారం అందించి ఖాళీ చేయిస్తామని గడిచిన జులైలో విరుచుకుపడిన వరదల సమయంలో అక్కడ పర్యటించిన సిఎం హామీ ఇచ్చారు. నెలలు గడిచిపోతున్నా పరిహారం మాత్రం ఇవ్వలేదు. 41.15 కాంటూరు పరిధిలో కుక్కునూరు మండలంలో ఎనిమిది గ్రామాలు ఉండగా 2,977 కుటుంబాలు ఉన్నాయి. వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలుండగా 4,094 కుటుంబాలు ఉన్నాయి. రెండు మ ండలాల్లోనూ ఖాళీ చేయించాల్సిన కుటుంబాలు 7,071 ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇప్పటి వరకూ మొత్తంగా 200 కుటుంబాలకు మాత్రమే పరిహారం అందినట్లు తెలుస్తోంది. వేసవి వచ్చేసింది. అనంతరం వర్షాకాలం ప్రారంభం కానుంది. పరిహారం ఇస్తారో లేదో కూడా తెలియని దుస్థితి నెలకొంది. అంతేకాకుండా పునరావాస ప్యాకేజీ రూ.పది లక్షలు ఇస్తామని, 2006కు ముందు సేకరించిన భూములకు రూ.ఐదు లక్షలు చొప్పున ఇస్తామని నిర్వాసితులకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ హామీలు కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. సిఎం జిల్లాకు రానుండటంతో తమ సంగతేంటంటూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఇక 45.72 కాంటూరు పరిధిలో ఉన్న 14,703 కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.