Nov 14,2023 00:02

ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా/మాచర్ల : వరికపూడిశెల ఎత్తిపోతల పథకం శంకుస్థాపన నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్లలో బుధవారం నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సోమవారం సమీక్షించారు. సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న వారికి సరైన సమయంలో అల్పాహారం, భోజన వసతిని ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. విధులు కేటాయించిన అధికారులందరూ ఏకాగ్రతతో పని చేయాలన్నారు. గ్యాలరీలలో వచ్చే ప్రజానీకాన్ని క్రమ పద్ధతిలో ఆయా గ్యాలరీలలో కూర్చునే విధంగా ఆయా గ్యాలరీల ఇన్చార్జిలు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా మరియు నిరంతర విద్యుత్తు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కల్పశ్రీ, ప్రభుత్వ విప్‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆర్‌డిఒలు శేషిరెడ్డి, రమాకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిరిగిరిపాడు వద్దగల వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపనకు సిఎం రానున్న సందర్భంగా ఆ ప్రదేశం వద్ద, సభా ప్రాంగణం వద్ద భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి పరిశీలించారు. సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని, పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కోకుండా ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బందిని నియమించి, ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ డైవర్షన్స్‌ సూచించి, రాకపోకలకు అనువైన మార్గాలను సూచించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఎక్కడికక్కడ ప్రత్యేక బలగాలతో తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్‌) రామచంద్రరాజు, గురజాల డిఎస్‌పి పల్లపు రాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.