
ప్రజాశక్తి - మాచర్ల, పల్నాడు జిల్లా : నియోజకవర్గ కేంద్రమైన మాచర్ల పట్టణానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వస్తున్న సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు రాష్ట్ర యువజన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అనంతరం పట్టణంలోని గుంటూరు రహదారి చెన్నకేశవకాలనీ సమీపంలో బహిరంగ సభలో సిఎం మాట్లాడతారు. 12 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. నాగార్జున సాగర్ రహదారిలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 10.35కు హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాచర్లకు చేరుకుంటారని, అక్కడ నుండి రోడ్డు షోలో పాల్గొని 11 గంటలకు సభాస్ధలికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.25 గంటలకు సభ పూర్తవుతందని, అనంతరం హెలిపాడ్ స్థలానికి చేరుకుని 1.30 వరకు స్థానిక నేతలతో సిఎం సమావేశమవుతారని, అది ముగిశాక తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. సెయింట్ ఆన్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్ వద్ద నుండి సభాస్థలి వరకు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ వందల ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.
పట్టణంలో సిఎం పర్యటనకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 2 వేల మంది సిబ్బంది మంగళవారం నాటికే మాచర్లకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం నాటికి సభాస్థలి, హెలిపాడ్ ప్రదేశాలను పూర్తిగా పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు.
వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే బస్సు నిలుపే ప్రాంతాలను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, జెసి శ్యామ్ ప్రసాద్, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన వారిని ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కలిసే ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజా సమస్యలపై వినతులిచ్చే వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే సిఎం వద్దకు అనుమతించాలన్నారు. ముఖ్యమంత్రి కాన్వారు బస్సును పరిశీలించి, సభాస్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.
ఇదిలా ఉండగా బందోబస్సుపై పోలీస్ సిబ్బందితో ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి సమీక్షించారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 37 మంది సిఐలు,150 మంది ఎస్సైలు, 220 మంది ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 896 మంది కానిస్టేబుళ్లు, 88 మంది మహిళా కానిస్టేబుళ్లు, 436 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 1837 మందితో పాటు 50 మంది ప్రత్యేక బలగాల సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీవీఐపిలు, వీఐపీలు సంచరించే హెలిప్యాడ్, సభా ప్రాంగణం, రహదారి వెంట బందోబస్తు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రముఖులు, ప్రజల వాహనాలకు కేటాయించిన పార్కింగ్ స్థలాల గురించి చెప్పాలన్నారు. సమస్య ఏదైనా వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించాలన్నారు. అందరితో మర్యాదగా మెలగాలని చెప్పారు. ఈ సందర్భంగా సిఎం కాన్వారు రాకపోకల రిహార్సిల్స్‌ను పరిశీలించారు.