Dec 29,2022 23:42

సిఎం సభావేదిక

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఈనెల 30న శుక్రవారం నర్సీపట్నం వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల కోఆర్డినేటర్‌ రఘురాం, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌, కలెక్టర్‌ రవి పటాన్‌ శెట్టి, ఎస్పీ గౌతమిశాలి తదితరులు పరిశీలించారు. నర్సీపట్నంలోని జోగినాధుని పాలెంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సభా ప్రాంగణాన్ని, బలిఘట్టం బైపాస్‌ రోడ్‌ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ ను వీరు సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు మంత్రి అమర్నాథ్‌ సూచనలు ఇచ్చారు.
కాన్వారు ట్రయిల్‌ రన్‌
సీఎం కాన్వారు ట్రయిల్‌ రన్‌ విశాఖ రేంజ్‌ హరికృష్ణ ఆధ్వర్యంలో విస్తతమైన పోలీస్‌ బందోబస్తు మధ్య గురువారం నిర్వహించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ దిగాక వరుస వాహనాలను శారద నగర్‌ బైపాస్‌, శ్రీ కన్య జంక్షన్‌, పెద్దబొడ్డేపల్లి మీదుగా జోగినాదునిపాలెం వద్ద బహిరంగ సభ ప్రదర్శన వరకు ట్రయిల్‌ రన్‌ జరిగింది. సీఎం కాన్వారులో జామర్‌, కాన్వారు, అంబులెన్స్‌ తదితర వాహనాలు ఉన్నాయి. బలిఘట్టం నుండి జోగినాధునిపాలెం సభా ప్రాంగణం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర పార్టీ జెండాలను రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. సిఎంతో ఎమ్మెల్యే ఫోటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పూర్తి ముస్తాబు చేశారు. అధికారిక కార్యక్రమం అయినప్పటికీ పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. అడుగడుగునా డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు.
సిఎం సభ ప్రాంగణం రెడీ
జోగినాధునపాలెం వద్ద జరగబోయే సీఎం సభాస్థలిని సిద్ధం చేశారు. ఈ సభాస్థల్లో 50 వేల మంది సీఎం సభను వీక్షించేలా ఏర్పాటు చేశారు. 1250 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు.వీరిలో ఏడు మంది అడిషనల్‌ ఎస్పిలు, 12మంది డిఎస్పిలు, 35 మంది సిఐలు, 92 మంది ఎస్‌ఐలు, 225 మంది ఏఎస్‌ ఐలు, 496 మంది కానిస్టేబుళ్ళు, 116 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 262 మంది హౌంగార్డులు, 600 ఏఆర్‌ స్పెషల్‌ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. మూడంచెల భద్రత ఉంటుంది. సిఎం విశాఖపట్నంకు విమానంలో వస్తారు. అక్కడి నుంచి నర్సీపట్నంకు హెలికాప్టర్లో రానున్నారు.