- కలెక్టర్ విజరురామరాజు, ఎస్‌పి అన్బురాజన్
ప్రజాశక్తి-కడప/వేంపల్లె/పులివెందుల టౌన్ : ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ఈ నెల 8, 9,10వ తేదీ వరకు మూడు రోజుల పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ విజరురామరాజు, ఎస్‌పి అన్బురాజన్ గురువారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో గురువారం వారు పర్యటించారు. కడప నగర పర్యటన నేపథ్యంలో ఆర్ట్స్ కళాశాలలోని హెలిప్యాడ్, రాజీవ్ మార్గ్, పార్క్, ఎయిర్‌పోర్ట్, కొప్పర్తి పారిశ్రామికవాడలోని అల్ డిక్సన్ టెక్నాలజీస్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. అనంతరం వేంపల్లె మండలంలోని ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్, ముఖ్యమంత్రి నివాసం, ప్రేయర్ హాల్, ఆర్కేవ్యాలీ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పులివెందులలో మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోని ముఖ్యమంత్రి ప్రారంభించబోయే నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని, నగరవణాన్ని, గరండాల వంక బోటింగ్, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యాలయ భవనాన్ని, హాకీ స్టేడియం, వైఎస్‌ఆర్ క్రికెట్ స్టేడియం, తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలపై పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎఆర్ ఎఎస్‌పి ఎస్.ఎస్.ఎస్.వి.కృష్ణారావు, కడప, పులివెందుల డిఎస్‌పిలు ఎం.డి.షరీఫ్, వినోద్ కుమార్, ఎస్‌బి సిఐ రాజాప్రభాకర్, పాడా ఒఎస్‌డి అనిల్ కుమార్‌రెడ్డి, ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పీడీ యధుభూషన్‌రెడ్డి, వేంపల్లె జడ్‌పిటిసి రవికుమార్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డి, రెవెన్యూ, పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
- పులివెందులలో సిఎం జగన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్‌పి










