Oct 10,2023 23:43

సభా ప్రాంగణం ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా

కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా
ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
సామర్లకోటలో ఈ నెల 12న జరిగే సిఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా పేర్కొన్నారు. మంగళవారం ఎస్‌పి ఎస్‌.సతీష్‌కుమార్‌, రాష్ట్ర గహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ దవులూరి దొరబాబు, జెసి ఎస్‌.ఇలాక్కియా, ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆమె ఈ ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత పెద్దాపురం-జి.రాగంపేట రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సామర్లకోట ఇటిసి జగనన్న కాలనీలో గృహప్రవేశాలకు సిద్ధం చేసిన గృహ సముదాయాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటిసి కాలనీలో సిద్ధం చేసిన పార్కులు, దివంగత వైఎస్‌ఆర్‌ విగ్రహం, స్వాగత ద్వారాలు, ఫోటో ప్రదర్శనకు సిద్ధం చేసిన స్టాల్స్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సభావేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కతికా శుక్లా మాట్లాడుతూ సామూహిక గృహప్రవేశాల ప్రారంభోత్సవానికి సిఎం ఈ నెల 12న రానున్నారన్నారు. పెద్దాపురం రోడ్డులో సిద్ధం చేసిన హెలిప్యాడ్‌ నుంచి 2.2 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహిస్తారన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో మాట్లాడతారన్నారు. సామర్లకోట ఇటిసి జగనన్న కాలనీకి సంబంధించి 1,003 గృహాలు పూర్తయ్యాయన్నారు. ఇక్కడ అన్ని వసతులు కల్పించామన్నారు. ఎస్‌పి ఎస్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రజలు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ చేపట్టామన్నారు. ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా పెద్దాపురం నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇబి అడిషనల్‌ ఎస్‌పి ప్రేమ్‌కాజల్‌, ఎఆర్‌ ఎస్‌పి బి.సత్యనారాయణ, అదనపు ఎస్‌పి పి.శ్రీనివాసు, ఆర్‌డిఒలు ఎన్‌వివి.సత్యనారాయణ, జె.సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.